Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-15 మందిలోపు విద్యార్థులున్న కోర్సులు రద్దు
- ఉన్నత విద్యామండలి నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 86,670 సీట్లకు కోత పడింది. 15 మంది విద్యార్థుల కంటే తక్కువ మంది చేరిన కోర్సులను ఉన్నత విద్యామండలి రద్దు చేసింది. ఇంకోవైపు సున్నా ప్రవేశాలు నమోదైన పలు డిగ్రీ కాలేజీలను మూసేసింది. దీంతో డిగ్రీ సీట్లకు భారీగా కోత పడింది. 2022-23 విద్యాసంవత్సరంలో 1080 డిగ్రీ కాలేజీల్లో 4,73,214 సీట్లున్నాయి. 2023-24 విద్యాసంవత్సరంలో 1054 డిగ్రీ కాలేజీల్లో 3,86,544 సీట్లకు తగ్గాయి. అంటే 86,670 సీట్లకు కోతపడింది. ఇంకోవైపు 26 డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి. అయితే కొన్ని కాలేజీలు తక్కువ మంది చేరిన కోర్సుల్లో ఉన్న సీట్లను డిమాండ్ ఉన్న ఇతర కోర్సుల్లోకి కన్వర్షన్ చేశాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని డిగ్రీ కాలేజీలు ప్రమాదంలో ఉన్నాయి. వాటిలో విద్యార్థులు చేరకపోవడంతో సీట్లు భారీగా మిగులుతున్నాయి. గత విద్యాసంవత్సరంలో 30 మంది విద్యార్థుల్లోపు 184 కాలేజీలు, 50 మంది విద్యార్థుల్లోపు సుమారు 250 కాలేజీలుండడం గమనార్హం. ఇంకోవైపు ఏటా డిగ్రీ కాలేజీల్లో సీట్లు మిగులుతుండడంతో సీట్లు తగ్గించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మరోవైపు ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం, డిగ్రీ కాలేజీల్లో ఎక్కువ సీట్లు ఉండడం మరో కారణంగా ఉన్నది. ఉదాహరణకు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ప్రస్తుతం 2,95,550 మంది విద్యార్థులయ్యారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో మరో 50 వేల మంది పాసవుతారు. అందరూ కలిపినా 3.45 లక్షల మంది అవుతారు. ఇందులో సుమారు 70 వేల మంది ఇంజినీరింగ్‌లో చేరతారు. మరో పది వేల మంది వరకు ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశం పొందుతారు.
ఇంకో 50 వేల మంది వరకు ప్రయివేటు విశ్వవిద్యాలయాలు, దోస్త్ పరిధిలో లేని ప్రయివేటు డిగ్రీ కాలేజీలు, ఇతర రాష్ట్రాలతోపాటు అగ్రికల్చర్, ఫార్మసీ వంటి కోర్సుల్లో చేరేందుకు మొగ్గు చూపుతారు. దీంతో ఇంటర్ పాసైన విద్యార్థులు సుమారు 2.45 లక్షల మంది మాత్రమే మిగులుతారు. ఇందులోనూ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మరో 30 వేల మంది ప్రవేశం పొందుతారు. ఇక ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో చేరే విద్యార్థులు 2.15 లక్షల మంది వరకే ఉంటారు. కానీ ఈ ఏడాది దోస్త్ పరిధిలో 3,86,544 సీట్లున్నాయి. అందుకే డిగ్రీ కాలేజీల్లో ఎక్కువ సీట్లు మిగులుతున్నట్టు కనిపిస్తున్నాయని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి తనను కలిసిన విలేకర్లతో చెప్పారు. విద్యార్థుల్లేకుండా సీట్లు ఎలా భర్తీ అవుతాయని అన్నారు.