Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 12న తాలుకా, జిల్లా కేంద్రాల్లో నిరాహారదీక్షలు
- నవంబర్ 3న పార్లమెంట్ మార్చ్
- ఎస్టీఎఫ్ఐ జనరల్ కౌన్సిల్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ), జాతీయ పింఛన్ పథకం (ఎన్పీఎస్) రద్దు చేయాలని కోరుతూ జులైలో పాదయాత్ర నిర్వహించనున్నట్టు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) ప్రకటించింది. ఆగస్టు 12న తాలుకా, జిల్లా కేంద్రాల్లో 24 గంటలపాటు నిరాహారదీక్షలు చేపట్టనున్నట్టు వివరించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు నవంబర్ మూడో తేదీన పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పిలుపునిచ్చింది. కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించిన ఎస్టీఎఫ్ఐ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈనెల 10,11 తేదీల్లో ఆ సంఘం అధ్యక్షుడు కెసి హరికృష్ణన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి సిఎన్ భారతి మాట్లాడుతూ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన ఉద్యోగుల పింఛను సొమ్మును వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ-2020)ని ఉపసంహరించాలని కోరారు. చరిత్ర పాఠాలు, శాస్త్రీయ అంశాలను తొలిగించి, చరిత్రను వక్రీకరించే పాఠాలను ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా దశలవారీ పోరాట కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. 2004 నుంచి అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం (సీపీఎస్), ఎన్పీఎస్ వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేయక పోగా, రద్దు చేసిన రాష్ట్రాలు ఇప్పటి వరకు పెన్షన్ ఫండ్‌లో జమచేసిన సొమ్మును వెనక్కి ఇచ్చేది లేదంటూ చెప్పటం దారుణమని విమర్శించారు. సీపీఎస్‌పై అధ్యయనం కోసం కమిటీ వేయటం కంటితుడుపు చర్యేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 2013లో చేసిన పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి, పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అధ్యక్షత వహించిన కెసి హరికృష్ణన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలైన లౌకికవాదం, ప్రజాస్వామ్యం సూత్రాలకు భిన్నంగా అంధవిశ్వాసాలను పెంపొందించడానికి అనుగుణంగా జాతీయ విద్యావిధానం ఉందని విమర్శించారు. సృజనాత్మకత, ప్రశ్నించే తత్వాన్ని పొంపొందించే విద్యావిధానాన్ని రూపొందించి అమలుచేయాలని డిమాండ్ చేశారు. శాస్త్రీయ విధానంతో రాసిన చరిత్రను తొలిగించి, అవాస్తవమైన, అభూత కల్పనలతో కూడిన అంశాలను చరిత్ర పాఠాలుగా ప్రవేశ పెట్టడాన్ని ప్రజలందరూ నిరసించాలని కోరారు. గాంధీ, భగత్ సింగ్ పాఠాలతోపాటు, శాస్త్రీయంగా నిరూపణకు నిలబడిన డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని తొలిగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిద్వారా శాస్త్రీయ అంశాలు భవిష్యత్ తరాలకు తెలియకుండా చేయడానికి చేసే ప్రయత్నమని అన్నారు. కార్పొరేట్, ప్రయివేటు అనుకూల విధానాలతో ప్రజలపై మోపుతున్న భారాలను నిరసించాలన్నారు. కేంద్రంలో రెజ్లింగ్ క్రీడాకారులు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తూ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను తొలగించి క్రీడాకారులకు న్యాయం చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో ఎస్టీఎఫ్ఐ కోశాధికారి ప్రకాష్ చంద్ర మొహంతి, జాయింట్ జనరల్ సెక్రటరీ సుకుమార్ పైన్, ఉపాధ్యక్షులు ఎం సంయుక్త, చావ రవి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య, ఉపాధ్యక్షులు సిహెచ్ దుర్గాభవాని, కార్యదర్శి వి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.