Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన పోస్టులన్నీ ఖాళీ
- ఫైనాన్స్, ప్లానింగ్ అన్ని ఒకరికే
- నెలలో స్కూళ్లు ప్రారంభం
- పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టేనా?
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
పేద విద్యార్థులకు విద్యనందించడంలో కీలకంగా ఉన్న సమగ్ర శిక్షా కార్యాలయం ఖాళీలతో వెక్కిరిస్తోంది. జిల్లాలోని కీలకమైన ప్రధాన పోస్టులన్నీ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా సమగ్ర శిక్ష గాడి తప్పుతోంది. మరో నెల రోజుల్లో స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. జూన్ 1వ తేదీ నాటికే విద్యార్థులకు పుస్తకాలతో పాటు యూనిఫామ్స్ అందజేయాలని సర్కారు ఆదేశించింది. కానీ జిల్లాలో అనుకున్న లక్ష్యం చేరలేని పరిస్థితి నెలకొంది. ఇక కీలకమైన బాధ్యతలన్నీ ఒకరికే అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైనాన్స్ విభాగంతో పాటు ప్లానింగ్, క్వాలిటీ, ఐఅండ్ఈ తదితర విభాగాల బాధ్యతలను ఒకరికే అప్పగించారు. ఇక కార్యాలయంలో కీలక పోస్టులు ఖాళీ ఉండటంతో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై అధిక పని భారం పడుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.
నిజామాబాద్ జిల్లాలో సమగ్ర శిక్ష కార్యాలయంలో ప్లానింగ్ కోఆర్డినేటర్, క్వాలిటీ అండ్ ఓఎస్సీ(ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్), ఐఅండ్ఈ (ఇన్క్ల్యూజివ్ ఎడ్యూకేషన్) కోఆర్డినేటర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ నాలుగు కీలకమైన పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల్లో ఉన్న అధికారులు ఇటీవల కాలంలో పదవీవిరమణ పొందారు. వీరి స్థానంలో ఇప్పటికీ కొత్త వారిని భర్తీ చేయలేదు. ఫలితంగా సమగ్ర శిక్ష లక్ష్యం నేరవేరడం లేదు. ప్లానింగ్ కో ఆర్డినేటర్.. జిల్లాలో ఎంతమంది విద్యార్థులున్నారు? టీచర్ల సంఖ్య ఏంటి? తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తుంటారు. అలాగే మన ఊరు-మన బడి పనులను పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు జిల్లాలో ఎన్ని స్కూళ్లు ఉన్నాయి.. ఏ స్కూళ్లో ఏ సౌకర్యాలు అవసరం తదితర వివరాలు సేకరించి అవసరమైన పనులు చేయిస్తుంటారు. కానీ ఇంతటి కీలకమైన స్థానం భర్తీకి నోచుకోలేదు. ఇక క్వాలిటీ అండ్ ఓఎస్సీ కో ఆర్డినేటర్.. జిల్లాలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. టీచర్లకు అవసరమైన శిక్షణ ఇవ్వడం, పాఠ్యాంశాల బోధనలో కొత్త మెళకువలు నేర్పడం చూస్తుంటారు. అలాగే బడి బయట ఉన్న పిల్లలకు సంబంధించి సర్వే చేయడం, వారందరినీ స్కూళ్లలో చేర్పించడం చేస్తుంటారు.
ఐ అండ్ ఈ కోఆర్డినేటర్ ప్రత్యేక అవసరాల పిల్లల చదువులకు సంబంధించి సమన్వయ కర్తగా వ్యవహరిస్తుంటారు. వీటన్నింటితో పాటు మరో కీలకమైన ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ పోస్టు సైతం ఖాళీగా ఉంది. స్కూళ్లకు సంబంధించిన గ్రాంట్లు, జీతభత్యలు తదితర ఆర్థిక అంశాలకు సంబంధించిన ఫైనాన్స్, అకౌంట్ ఆఫీసర్ పోస్టు కూడా ఖాళీగా ఉండటం గమనార్హం. కాగా, కీలకమైన ఈ స్థానాలకు సంబంధించిన బాధ్యలన్నీ ఒక్కరికే ఒకరికే అప్పగించడంతో సర్కారు అనుకున్న లక్ష్యం నేరవేరుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లక్ష్యం నేరవేరేనా?
మరో నెల రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. గతేడాది పుస్తకాలు, యూనిఫామ్స్ ఇవ్వడంలో తీవ్రమైన జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యేడాది జూన్1వ తేదీ వరకు అన్ని స్కూళ్లకు యూనిఫామ్స్ అందజేయాలని, పుస్తకాలు సరఫరా చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. కానీ జిల్లాలో ఈ బాధ్యతలు చూడాల్సిన కీలకమైన పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. దాంతో జిల్లాలో ప్రభుత్వ విద్య గాడితప్పే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే ఈ కీలకమైన పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరముంది. లేకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే నెలల తరబడి ఈ పోస్టులు ఖాళీగా ఉన్నా.. భర్తీ చేసేందుకు విద్యాశాఖాధికారులు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.