Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 65 రాయితీ సేవల్లో 11 మాత్రమే పునరుద్ధరణ
- కోవిడ్ తర్వాత 320 ప్యాసింజర్ రైళ్లు రద్దు
- వాటికే 'స్పెషల్స్' బోర్డు తగిలించి ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు
- ప్రయాణీకులను అడ్డంగా దోచుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే
- ఏదీ ఉచితం కాదంటున్న మోడీ సర్కార్
ఆర్థికాభివృద్ధి అంటే ఇప్పుడున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, మరింత మెరుగైన సేవల్ని విస్తరించి వృద్ధిని సాధించడం... ఇది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యాక, ఈ సూత్రం తిరగబడింది. సంక్షేమం అటకెక్కింది. ఉన్న వాటికే పేర్లు మార్చి జనం జేబుల్ని కొల్లగొడ్తూ, ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత ఆర్థిక దాష్టీకాన్ని అమల్లోకి తెచ్చారు. దానికి కోవిడ్ సంక్షోభాన్ని చక్కగా వాడుకున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ఏ నెలకు ఆ నెల ఆదాయం పెరుగుతున్నదంటూ ప్రజల్ని భ్రమల్లో ముంచెత్తుతుంటే, వాస్తవం ఏంటా అని 'నవతెలంగాణ' విశ్లేషణ చేసింది. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్‌కు ముందు సామాన్యుడికి అందుబాటులో ఉండే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి, వాటి పేర్లు, నెంబర్లు మార్చేసి, అవే రైళ్లలో ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారనే వాస్తవాలు వెల్లడయ్యాయి. దానికి తోడు కోవిడ్‌కు ముందు వివిధ కేటగిరిల ప్రజలకు రైల్వేశాఖ 65 రకాల రాయితీలు ఇచ్చేది. కోవిడ్‌ను సాకుగా చూపి వాటిలో 54 రకాల రాయితీలను ఎత్తేశారు. 'ప్రభుత్వం వ్యాపారం చేయదు' అని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మరి దేశవ్యాప్తంగా ఇప్పుడు రైల్వేశాఖ చేస్తున్నది ఏమిటో 'కమల గళాలే' సమాధానం చెప్పాలి. ప్రజలూ వాస్తవాల్ని గమనించాలి!
ఎస్ఎస్ఆర్ శాస్త్రి
రైల్వే ఆదాయం పెరుగుతుందంటే, వారి సేవలు విస్తరించాయనుకుంటే పొరపాటే! రైలు ప్రయాణీకులను మోడీ ప్రభుత్వం అడ్డంగా మోసం చేస్తూ, ఖజానాను నింపుకుంటున్నది. ఆ మోసాలకే రకరకాల పేర్లు పెట్టి, లేని రద్దీని సృష్టించి, దానికి అనుగుణంగా చార్జీలు పెంచి ప్రయాణీకుల్ని నిలువునా బాదేస్తుంది. ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రంలో స్వదేశీ 'వందే భారత్' ప్రారంభోత్సవాల పేరుతో ప్రచారార్భాటం చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి, వాటికే స్పెషల్ ట్రైన్స్ అని బోర్డులు తగిలించి, ఎక్స్‌ప్రెస్ రైలు చార్జీలను ముక్కుపిండి వసూలు చేస్తూ, 'దేశభక్తి'ని చాటుకుంటున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రజలు రైలు ప్రయాణానికి దూరం అవుతున్నారు. చౌకైన రైలు ప్రయాణాన్ని కేంద్ర ప్రభుత్వం ఖరీదు చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కోవిడ్ తర్వాత ఆదాయం పెరిగిందంటూ ఇటీవల ఆ జోన్ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ప్రకటించారు. సేవలు ఏం పెరిగాయా అని విశ్లేషిస్తే, కోవిడ్‌కు ముందు జోన్ పరిధిలో 340 ప్యాసింజర్ రైళ్లు తిరిగేవి. కోవిడ్ తర్వాత వాటిలో 60 రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి, టిక్కెట్ రేట్లు పెంచి, రైలు నిలిచే స్టేషన్ల సంఖ్యను తగ్గించారు. మరో 250 రైళ్లను ప్యాసింజర్ స్పెషల్ ట్రైన్స్ అని పేరు మార్చి వాటిలోనూ ఎక్స్‌ప్రెస్ రైళ్ల చార్జీలను వసూలు చేస్తున్నారు. రైలు ఆగే స్టేషన్ల సంఖ్యను కుదించారు. 10 రూట్లలో ప్యాసింజర్ రైళ్లను అసలు పునరుద్ధరించలేదు. 20 ప్యాసింజర్ రైళ్లను స్పెషల్ ట్రైన్స్‌గా పేరు మార్చి, యథాప్రకారం నడుపుతున్నారు. ప్యాసింజర్ రైళ్లు పేదలకు తక్కువ ఛార్జీతో ప్రయాణ సౌకర్యం కల్పించేవి. మోడీ ప్రభుత్వం వాటిని సామాన్యుడికి దూరం చేసింది. అలాగే గతంలో ప్యాసింజర్ రైళ్లు ఆగే స్టేషన్ల సంఖ్య ను కూడా కుదించడంతో సమీప గ్రామాల ప్రజలకు రైలు ప్రయాణం దూరం అయ్యింది.సికింద్రాబాద్-రేపల్లె (ట్రైన్ నెంబర్-57651) ప్యాసింజర్‌ను ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ, రైలు నెంబర్‌ను -17645గా మార్చారు. ఎక్స్‌ప్రెస్ రైలు టిక్కెట్ ఛార్జీని వసూలు చేస్తున్నారు. అలాగే కాకతీయ ప్యాసింజర్ రైలును కూడా ఎక్స్‌ప్రెస్‌గా మార్చి ట్రైన్ నెంబర్‌ను మార్చేశారు. ఇలాంటి జిమ్మిక్కులతో సామాన్యుడి జేబులు కొల్లగొట్టి రైల్వే ఆదాయం పెంచుకొని, తామేదో ఘనకార్యం సాధించినట్టు మోడీ సర్కార్ ప్రచారం చేసుకుంటున్నది.
రాయితీల పునరుద్ధరణ లేదు...
కోవిడ్‌కు ముందు పలు కేటగిరీల్లో రైల్వేశాఖ ప్రజలకు రాయితీలు ఇచ్చేది. సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులు, క్రీడాకారులు సహా మొత్తం 65 కేటగిరిల్లో రాయితీలు ఇచ్చేది. కోవిడ్‌ను సాకుగా చూపి మోడీ ప్రభుత్వం వాటన్నింటినీ రద్దు చేసింది. ప్రస్తుతం స్వాతంత్య్ర సమరయోధులు, వికలాంగులు, కిడ్నీ, కేన్సర్ రోగులు, పార్లమెంటు సభ్యులు, కేంద్రమంత్రులు సహా 11 కేటగిరిల్లో మాత్రమే రాయితీ ఇస్తున్నారు. గతంలో వికలాంగులకు సహాయకులుగా మరో వ్యక్తికి టిక్కెట్ రాయితీ ఇచ్చేవారు. ఇప్పుడు దాన్నీ ఎత్తేశారు. రాయితీలు కొనసాగించాలని పలుమార్లు జర్నలిస్టు సంఘాలు రైల్వే అధికారులు, మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చాయి. సీనియర్ సిటిజన్లకు రాయితీలు పునరుద్ధరించాలని పౌరసమాజం నుంచి అనేక విజ్ఞాపనలు వెళ్లినా, మోడీ సర్కార్ ఏమాత్రం స్పందించలేదు. సామాజిక బాధ్యతను విస్మరించి, ఆదాయమే పరమావధిగా రైళ్లను నడుపుతున్నారు.
సీట్లు, బెర్తుల బ్లాకింగ్
రైళ్లలో లేని రద్దీని సృష్టించేందుకు రైల్వేశాఖ సీట్లు, బెర్తుల్ని బ్లాక్ చేస్తున్నది.సహజంగా రైలులో ఎన్ని సీట్లు ఉంటాయో వాటన్నింటినీ రిజర్వేషన్ కోటాలో పెట్టాలి. అలా కాకుండా కేవలం 50 శాతం సీట్లను మాత్రమే రిజర్వేషన్ కోటాలో పెట్టి, మిగిలిన సీట్లను 'తత్కాల్' పేరుతో అధిక ధరలకు టిక్కెట్లు అమ్మేస్తున్నారు. ఫలితంగా రైలు ప్రయాణం సామాన్యులకు భారంగా మారుతున్నది.
వందే భారత్ భారం...
వేగంగా వెళ్తుందని చెప్తున్న వందే భారత్ రైలులో చార్జీలు ఎక్కువ. సాధారణ, ఎక్స్‌ప్రెస్ రైళ్లలోకంటే టిక్కెట్ ధర రెట్టింపు ఉంటుంది. వందే భారత్ రైళ్లలో రద్దీ పెంచడం కోసం సాధారణ, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో బోగీలను కుదిస్తున్నారు. ఫలితంగా రిజర్వేషన్ల వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత పెరిగి, ప్రయాణీకులు తప్పనిసరిగా వందేభారత్ రైళ్లలో ప్రయాణం చేసే పరిస్థితులు కల్పిస్తున్నారు. దీనితో ఆ రైళ్లలో ఆక్యుపెన్సీ రేషియో పెరుగు తున్నదని ప్రచారం చేస్తున్నారు. అసలు ప్రయాణీకుల అవసరాలకు తగినట్టు రైళ్లను నడపడంలో ఆ శాఖ పూర్తిగా విఫలమైందని రవాణారంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.