Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
- కరీంనగర్లో సీనియర్ సిటీజన్ డే కేర్ సెంటర్ ప్రారంభం
నవతెలంగాణ - కరీంనగర్
వృద్ధాప్యం శరీరానికి మాత్రమేనని మనస్సుకు కాదని, వృద్ధులను గౌరవించడం బాధ్యత అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన వృద్ధుల డే కేర్ సెంటర్‌ను బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకట్ నేత, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ సునీల్‌రావుతో కలిసి శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడంతోపాటు వారి సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టారన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఎంతో కృషిచేసి, ఉద్యోగ విరమణ పొందిన వారికి అద్భుతమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి, కాలక్షేపం కోసం వయోవృద్ధుల కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో పునరావాస కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వృద్ధాప్యం శరీరానికి మాత్రమేనని మనస్సుకు కాదని, గడచిన జీవితంలోని అనుభవాలు, సలహాలు సూచనలతో నేటి తరానికి మార్గనిర్దేశం చేసి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు. ప్రతి రోజూ డే కేర్ సెంటర్‌ను సందర్శించి కొంత సమయాన్ని గడపాలని సూచించారు.
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. సమాజానికి వివిధ రంగాల్లో ఎంతో సేవ చేసిన వారిని గౌరవించడం, పూజించడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు సీనియర్ సిటిజన్, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన రెస్క్యూ వాహనాన్ని, ఇదే భవనంలో ఏర్పాటు చేసిన వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, జిల్లా పరిషత్ సీఈఓ ప్రియాంక, డీడబ్లూఓ సబిత, డీఎంహెచ్ఓ లలితా దేవి, ఆర్డీఓ ఆనంద్ కుమార్, కార్పొరేటర్ దిండిగాల మహేశ్వర్, సీనియర్ సిటిజన్స్ మోహన్‌రెడ్డి, కేశవరెడ్డి, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.