Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భర్త వేధింపులే కారణం : ఎస్ఐ
- పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు
నవతెలంగాణ-ఖానాపురం
సెలవుల అనంతరం విధుల్లో చేరిన రోజే జూనియర్ పంచాయతీ కార్యదర్శి బైరి సోని(31) ఆత్మహత్య చేసుకుంది. దీనికి ఆమె భర్త వేధింపులే కారణమని పోలీసులు చెబుతుండగా.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సోని ఆత్మహత్య చేసుకుందంటూ తోటి కార్యదర్శులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ పిట్టల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం..
ఖానాపురం మండలం రంగాపురం గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శి బైరి సోని శుక్రవారం విధులకు హాజరై గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కల పెంపకంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో జేపీ ఎస్ సోని భర్త ప్రసాద్ ఫోన్ చేసి ఆమెను నానా దుర్భాష లాడుతూ వేధించారు. కాగా కొన్ని రోజులుగా ప్రసాద్ సోనిని అనుమానిస్తూ.. మానసికంగా వేధిస్తున్నాడు. ఉద్యోగం మానేయాలని ఒత్తిడికి గురిచేశాడు. శుక్రవారం కూడా అదే విధంగా ఫోన్ చేసి వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నర్సరీ కోసం తెచ్చిన పురుగుల మందు తాగింది. సమీప గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సమాచారం అందించింది. అనంతరం కార్యాలయం నుంచి తన ద్విచక్ర వాహనంపై నర్సంపేటలో ఉంటున్న నివాసానికి బయలుదేరగా.. మార్గమధ్యలో కొత్తూరు గ్రామం వద్ద స్పృహ కోల్పోయి పడిపోయింది. అంతకు ముందు సోని ఫోన్ చేసిన సమీప పంచాయతీ కార్యదర్శి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో నర్సంపేటలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు సోని అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకున్నారు. తన కూతురు మృతికి భర్త ప్రసాద్ కారణమంటూ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోని మృతదేహాన్ని నర్సంపేటలోని మార్చురీకి తరలించారు. కాగా, సోనికి ఏడేండ్ల కూతురు ఉంది.
జేపీఎస్‌ల ఆందోళనలో స్వల్ప ఉద్రిక్తత
జేపీఎస్ సోని మృతి సమాచారం తెలుసుకున్న తోటి జేపీఎస్‌లు మార్చురీ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ నినాదాలు చేస్తూ అక్కడనే బైటాయించారు. జేపీఎస్‌ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చురీ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఏసీపీ సంపత్‌రావు, సీఐ సూర్యప్రకాష్ అక్కడికి చేరుకొని సోనీ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జేపీఎస్‌ల ప్రతినిధులతో చర్చించి నచ్చజెప్పారు.
సోని మృతికి కుటుంబ కలహాలే కారణమని, దీనిని జేపీఎస్‌ల సమస్యగా చిత్రీకరించొద్దని సూచించారు. అయినా జేపీఎస్‌లు తమ ఆందోళన కొనసాగించారు. సోని తల్లిదండ్రుల వాంగ్మూలం తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ సంపత్ రావు తెలిపారు. మార్చురీ వద్దకు జిల్లా పంచాయతీ అధికారి కటకం కల్పన, ఎంపీడీవో సుమనవాణి, ఎంపీఓ పసరగొండ రవి తదితరులు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మృతదేహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
సోని మృతదేహాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శి ంచారు. ఆమె తల్లిదండ్రులను ఓదార్చి సంఘటన విచారణ కరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులచే విచారణ జరిపించి తగు న్యాయం చేస్తామ ని హామీ ఇచ్చారు. ఎంపీపీ వేములపల్లి ప్రకాశరావు నివాళి అర్పించారు.