Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
- 'ఉపాధి' పరిరక్షణకు ఐక్య పోరాటాలు: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు
నవతెలంగాణ-చౌటుప్పల్
రొడ్డ అంజయ్య స్ఫూర్తితో ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం, ప్రజాసమస్యలపైనా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో, పంతంగి గ్రామంలో శుక్రవారం వ్యకాస జిల్లా మాజీ అధ్యక్షులు రొడ్డ అంజయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంతంగిలో అంజయ్య స్థూపం వద్ద పార్టీ జెండాను సీతారాములు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. కూలి పెంచాలి, భూమి పంచాలి, కులవివక్షతను నిర్మూలించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అంజయ్య అనేక ఉద్యమాలు నిర్వహించారన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేశారని తెలిపారు. అంజయ్య సీపీఐ(ఎం) బలోపేతానికి ఎంతో కృషిచేశారని తెలిపారు.
అలాగే, కందాల రంగారెడ్డి స్మారక భవనంలో వ్యకాస జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన 'ఉపాధి హామీ చట్టం అమలు - సవాళ్లు' అంశంపై సదస్సులో వెంకట్రాములు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేసే కుట్ర చేస్తుందని విమర్శించారు. కూలీలకు పనిముట్లు, నీడ కోసం టెంట్లు, నీరు, దూర ప్రాంతం పోతే ప్రయాణ చార్జీలు, పని ప్రదేశంలో మెడికల్ కిట్లు లేక అవస్థలు పడుతున్నారని చెప్పారు. గతేడాది సగటు పనిదినాల సంఖ్య 47 మాత్రమేనని, కనీసం ఏడాదిలో వంద రోజులు పని కల్పించాలని చట్టం చెబుతున్నప్పటికీ ప్రభుత్వం అందులో సగం కూడా కల్పించడం లేదన్నారు. 2023-24 బడ్జెట్లో రూ.60 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, గతేడాది సవరించిన అంచనా కేటాయింపులో ఏకంగా 33 శాతం కోత పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కార్మికులకు వారం వారం డబ్బులు చెల్లించి, చట్టంలో ఉన్న వాటిని అమలు చేయాలని, రోజు కూలి రూ. 600 ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా సౌకర్యం రూ.5లక్షలు ఇవ్వాలని కోరారు.
వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య, ఉపాధ్యక్షులు ములకలపల్లి రాములు మాట్లాడుతూ.. రొడ్డ అంజయ్య.. వ్యవసాయ కూలీల కూలి రేట్ల పెంపు కోసం, సామాజిక, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా అనేక సమరశీల పోరాటాలకు నాయకత్వం వహించి ముందుండి పోరాడారని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేక పోరాటాల్లో తన పాత్ర ఉన్నదని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ.. అంజన్న విద్యార్థి దశ నుంచి వామపక్ష భావజాలంతో ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాల్లో పనిచేశారని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి, మున్సిపల్ వైస్చైర్మెన్్ బత్తుల శ్రీశైలం, వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు గంగదేవి సైదులు, జల్లెల పెంటయ్య, జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు, జిల్లా సహాయ కార్యదర్శి గుంటోజి శ్రీనివాస్ చారి, సిరిపంగి స్వామి, మండల ప్రధాన కార్యదర్శి బొజ్జ బాలయ్య, అంజన్న సతీమణి రొడ్డ రాములమ్మ, అశోక్, భగత్, బాలరాజు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.