Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి సమస్యలు పరిష్కరించాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-కంఠేశ్వర్
యూనియన్ పెట్టుకున్నందుకు.. సమ్మె చేస్తున్నందుకు జేపీఎస్‌లను తొలగిస్తామని ప్రభుత్వం ఇచ్చిన నోటీసును ఉపసంహరించు కోవాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. వారి సమస్యను పరిష్కరించి సమ్మెను విరమింపజే యాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పంచాయతీ కార్యదర్శుల సమ్మె శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపి జేపీఎస్‌లతో మాట్లాడారు. జేపీఎస్‌ల సమ్మెకు సీఐటీయూ రాష్ట్ర కమిటీ అండగా ఉందని చెప్పారు.వీరి సమస్యలపై చర్చించి సామరస్యంగా పరిష్కరించకుండా ప్రభుత్వం అణచివేత ధోరణికి పాల్పడటం సరికాదన్నారు. యూనియన్ పెట్టుకోవడం ఉద్యోగుల హక్కు అని, ప్రభుత్వ ఉద్యోగులకు, పారిశ్రామిక కార్మికులకు ప్రతి ఒక్కరికీ యూనియన్లు పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు ఉందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తామని తాము చెప్పలేదని, ఒకవేళ చేయాల్సి వస్తే కమిటీ వేసి పర్ఫామెన్స్ ఆధారంగా చేస్తామని పాలకులు అంటున్నారని, ఇది చాలా అన్యాయమని అన్నారు. వెంటనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వి రమ, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, రాజు, నవీన్, లక్ష్మీ, పద్మ, కవిత తదితరులు పాల్గొన్నారు.