Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్ఏ జేఏసీ రౌండ్‌టేబుల్ సమావేశంలో హరగోపాల్
- ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- అండగా ఉంటాం..ప్రత్యక్ష కార్యాచరణలో పాల్గొంటాం : ప్రజా, కార్మిక, సామాజిక సంఘాల నేతల భరోసా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'వీఆర్ఏలను రెగ్యులర్ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వాగ్దానం చేశారు. ఉద్యమ కాలంలోనూ తెలంగాణ వస్తే కాంట్రాక్టు వ్యవస్థనే ఉండబోదని కేసీఆర్ అనేక సార్లు చెప్పారు. కానీ సీఎంగా తొమ్మిదేండ్ల కాలంలో ఇచ్చిన మాటను మర్చిపోయారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోతే విశ్వసనీయత కొల్పోతారు. వీఆర్ఏల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల మద్దతు ఉంటే ఎంతటి సమస్యయినా పరిష్కారం కావాల్సిందే. అందుకు తెలంగాణ ఉద్యమమే నిదర్శనం. ఏ ఒక్కరితో తెలంగాణ రాలేదు. ప్రజా ఉద్యమంతోనే సాధ్యమైంది' అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆ సంఘం సెక్రటరీ జనరల్ దాదేమియ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమస్యను సర్పంచ్ల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం అంటే వీఆర్ఏ నుంచి సీఎం దాకా అని చెప్పారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం, దేశంలో పీఎం చుట్టూనే పాలన కేంద్రీకృతమైందని అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో వీఆర్ఏల సమస్య కచ్చితంగా రాజకీయ ఎజెండా అవుతుందని, ఆ దిశగా వారు తమ ఉద్యమాన్ని కొనసాగించాలని కోరారు. అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా వీఆర్ఏలకు అండగా ఉండాలని సూచించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ వీఆర్ఏలకు ఎర్రజెండా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు 40వేలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 80వేల మంది ఉన్నారంటూ అసెంబ్లీలో సీఎం లెక్కలు చెప్పారని గుర్తుచేశారు. కానీ 11వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులే ఉన్నారంటూ జీఓ నెం.16 జారీచేశారని, కానీ 5544 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ సీఎం ఫైల్ మీద సంతకం చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో జేపీఎస్‌ల సమ్మె, వీఓఏల సమ్మెతోపాటు వీఆర్ఏలు కూడా సమ్మె చేయడానికి సిద్ధమవుతున్నారంటే ఈ ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగులను ఏండ్లుగా మోసం చేస్తుందనేది విదితమవుతున్నదని అన్నారు. 75 షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల కనీసవేతనాలకు సంబంధించిన జీఓలను ఎనిమిదేండ్ల నుంచి పెండింగ్ పెట్టారని గుర్తుచేశారు. తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని కంపెనీల్లో అన్ని జెండాలు పీకేసీ గులాబి జెండాలనే పెట్టారని, కానీ కంపెనీల కార్మికులకు ఎర్రజెండానే ద్కియిందని అన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీలకు నీళ్లు, నిధులు కేటాయిస్తున్నారని, కార్మికులను మాత్రం మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వీఆర్ఏల సమ్మెకు ఉద్యోగ సంఘాలు, ఎన్జీఓ సంఘాలు, ట్రెసా ఎందుకు మద్దుతివ్వడంలేదని ప్రశ్నించారు. వీఆర్ఏల ఐక్యత, ప్రజల మద్దతుతో ప్రభుత్వం మెడలు వంచేదాకా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు మాట్లాడుతూ జేపీఎస్‌లు సమ్మె చేస్తే ప్రభుత్వం స్పందించకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నదని అన్నారు. కనీస వేతనాల కోసం కార్మికులు, ఉద్యోగులు పోరాటాలు చేసినా పట్టించుకోని ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఏం పోరాటం చేశారని వేతనాలు పెంచిందని ప్రశ్నించారు. జేఏసీ కో-కన్వీనర్ వంగూరు రాములు మాట్లాడుతూ 80రోజుల సమ్మె కారణంగా 75మంది వీఆర్ఏలు ఆత్మహత్య చేసుకున్నారని, కొంత మంది అనారోగ్యంతో చనిపోయారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ఆ కుటుంబాలను ఆదుకునే దిక్కులేక రోడ్డున పడ్డాయని అన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు పాలడుగు సుధాకర్, రైతు సంఘం సహాయ రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్, జేఏసీ కో-కన్వీనర్లు వెంకటేష్, మాధవనాయుడు, టీఎన్టీయూసీ నాయకులు ప్రసాద్, ఏఐయూటీయూసీ నాయకులు ఆంజనేయులు, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ, జేఏసీ కో-కన్వీనర్లు రఫి, నాయకులు బి.రాములు, చందు, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ కార్యాచరణ
వీఆర్ఏల పోరాటాన్ని ఉధృతం చేయాలని రౌండ్‌టేబుల్ సమావేశం నిర్ణయించింది. గ్రామాల్లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రజా, కార్మిక, సామాజిక సంఘాలను కలుపుకుని ప్రజా ఉద్యమంగా మార్చాలని నిర్ణయించింది.
- ఈనెల 18న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కుటుంబ సభ్యులతో ప్రదర్శనలు, స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేయాలి.
- 25న అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ప్రదర్శనలు చేసి కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలి. అన్ని ఉద్యోగ, ప్రజా, కార్మిక, సామాజిక సంఘాలను ఆహ్వానించాలి.
- 30న చాలో హైదరాబాద్‌లో భాగంగా సీసీఎల్ఏ కార్యాలయం వద్ద ధర్నా చేయాలి. అన్ని జిల్లాల్లోని వీఆర్ఏలు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నాను విజయవంతం చేయాలి.