Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్యూరిఫైడ్ వాటర్ పేరుతో దందా
- భగీరథ నీళ్లొస్తున్నా.. ప్యూరిఫైడ్ నీటికే జనం తహతహ
- గల్లీగల్లీకి వెలిసిన ప్లాంట్లు
- అపరిశుభ్రత వాతావరణంలో ప్లాంట్ల నిర్వహణ
- ఆ నీళ్లు ఆరోగ్యాన్ని చెడగొట్టేవంటున్న వైద్యులు
- తనిఖీలు చేయని అధికారులు
నవతెలంగాణ - కరీంనగర్ప్రాంతీయ ప్రతినిధి
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఫిల్టర్ వాటర్ ప్లాంట్ కరీంనగర్ జిల్లా కేంద్రం అల్గునూర్లోనిది. ఈ ప్లాంట్ మిషనరీ చుట్టూ పాకురుతో నిండిన నీళ్లు, దుమ్ముధూళి సహా కనీస పరిశుభ్రత లేదు. ఆ ట్యాంకులను ఏర్పాటు చేసిననాటి నుంచి శుభ్రం చేయరు. కనీస పరిశుభ్రత కూడా లేని ఇక్కడి నీళ్లు తాగితే.. ఏ రోగాలు వస్తాయో తెలియని దుస్థితి. డబ్బులు ఇచ్చి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్న పరిస్థితి.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో చాలా ప్లాంట్లలో సాగుతున్నది ఇదే. ప్లాంట్ల చుట్టూ అపరిశుభ్ర పరిస్థితులు.. సరిగా శుభ్రం చేయని ట్యాంకులు, పైపులు.. నామ్కేవాస్తేగా పైపైన కడిగి నీళ్లు నింపే బబుల్స్.. కొన్నిచోట్ల మురుగునీరు పారుతున్నా ఆ పక్కనే కొనసాగుతున్న వాటర్ ప్లాంట్లు.. ప్రమాదకర బ్యాక్టీరియా, ఫంగస్లకు నిలయాలుగా ఉన్నాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల పట్టించుకోనితనం కలిసి జనం ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతున్న దుస్థితి నెలకొంది. పట్టణాల్లోనే కాదు గ్రామాల్లోనూ ఈ వాటర్ ప్లాంట్లు వెలిశాయి. శుభ్రమైన భగీరథ నీళ్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. జనం ప్లాంట్ల నీటికే తహతహలాడుతుండటం గమనార్హం. అధికారులు వాటివైపు కన్నెత్తి చూడరు. ఏదైనా జరిగితే ఆ రోజు హడావుడి తప్ప మరుసటి రోజు ఏమీ ఉండదు. ప్లాంట్లపై కరీంనగర్లో 'నవతెలంగాణ' ప్రత్యేకంగా పరిశీలించింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లు సహా 60 మండలాల్లో 1203 పంచాయతీలు ఉన్నాయి. అత్యధిక మున్సిపాలిటీలు ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంచినీటి కోసం భారీగానే డిమాండ్ ఉంది. ముఖ్యంగా రూ.10కే 20 లీటర్లు ఇస్తుండటంతో ఫిల్టర్ వాటర్‌ను కొనుగోలు చేసేవారి సంఖ్య బాగా పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఎక్కడ పడితే అక్కడ వేలాదిగా వాటర్ ప్లాంట్లు వెలిశాయి. ఇందుకు చిన్నపాటి ప్లాంట్ ఏర్పాటుకు రూ.లక్షలోపే ఖర్చు అవుతోంది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ రాయితీని పొందాలన్నా.. ఐఎస్ఐ నాణ్యతా ప్రమాణాల ధ్రువీకరణ, కాలుష్య నియంత్రమండలి సర్టిఫికెట్ తదితర పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రమాణాలు పాటించే పరిస్థితి లేకపోవడంతో ఈ ప్లాంట్ల ఏర్పాటు కోసం రాయితీ రుణం కోసం వచ్చేవారు లేరని కరీంనగర్ ఇండిస్టీయల్ శాఖ మేనేజర్ 'నవతెలంగాణ'తో తెలిపారు. దీంతో మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డు, డివిజన్లో కనీసం రెండు చొప్పున, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఒకటి చొప్పున సుమారు 1500 వరకు ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఐఎస్ఐ మార్క్ రెండు మాత్రమే ఉన్నాయి.
క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా..
కరీంనగర్ జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలోనే చాలా ప్లాంట్లు కొనసాగుతున్నాయి. సుమారు 500కుపైగా వాటర్ ప్లాంట్లు ఉన్నట్టు అంచనా. చాలా చోట్ల నీటి బబుల్స్ (క్యాన్ల)ను పైపైనే శుభ్రం చేస్తున్నారు. ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. వాటర్ ప్లాంట్ల నుంచి టోకుగా నీళ్లు తెప్పించి, వాటిలో నింపుకొని అమ్ముతున్నారు. వారూ సరిగా ట్యాంకులను, పైపులను శుభ్రం చేయకపోవడంతో బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి పెరుగుతున్నాయి. ప్రతిరోజూ ఒక్కో ప్లాంట్ నిర్వాహకుడు రూ.2వేల నుంచి రూ.5వేల నీళ్లను అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన రోజుకు సుమారు రూ.30లక్షల నుంచి రూ.40లక్షల మధ్య వ్యాపారం సాగుతోంది. నెలకు రూ.10కోట్ల నుంచి రూ.15కోట్ల మధ్యన మంచినీళ్ల వ్యాపారం సాగుతుందంటే ఈ నీళ్లకు జనం ఎలా అలవాటుపడ్డారో అర్థం చేసుకోవచ్చు.
ప్లాంట్లపై పర్యవేక్షణ లేదు..
రూ.కోట్లలో వ్యాపారం నిర్వహిస్తున్న ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు? ఈ నీటిని ఎవరైనా నమూనాలను సేకిరంచి నిర్ధారించి అనుమతులు ఇస్తున్నారా? ఈ నీళ్లను శుద్ధి చేస్తున్నారా? లేదా? అని పర్యవేక్షించే వారు లేకుండా పోయారు. పలు సందర్భాల్లో డయేరియా కేసులు నమోదవుతూ ఉండటంతో ఈ నీళ్లపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ప్లాంట్ నుంచి ఇండ్లకు చేరే 20 లీటర్ల వాటర్ క్యాన్‌ను 90సార్లకంటే ఎక్కువగా వాడకూడదు. ఇక్కడ మూడేండ్లు దాటినా అవి పగిలితే తప్ప అవే క్యాన్లను వినియోగిస్తున్న పరిస్థితి నెలకొంది.
జాడ లేని నిబంధనలు...
శుద్ధి చేసిన నీటిని కొంత సమయం తర్వాతే తాగేందుకు వినియోగించాలి. కానీ వెంటవెంటనే పంపించేస్తున్నారు. వాటర్ బబుల్స్‌ను వినియోగించిన ప్రతిసారీ క్లోరిన్‌తో శుద్ధి చేయాలి. ఇది ఎక్కడా జరగడం లేదు. నామమాత్రంగా కడిగి మళ్లీ నీళ్లు నింపేస్తున్నారు. వాటర్ ఫ్యూరిఫికేషన్ చేసిన తరువాత టోటల్ డిసొల్వడ్ సాలిడ్స్ (టీడీఎస్) 150 ఉండేలా చూసుకోవాలి. అంతుకు మించి ఉంటే ఆరోగ్యానికి హానికరమని నిబంధనలు చెబుతున్నాయి. ప్లాంట్ ఓనర్లు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా టీడీఎస్ పరిమితిని వెయ్యి వరకు తీసుకెళ్తున్నారు. ఈ నీళ్లతో కిడ్నీ, జీర్ణ సంబంధిత అవయవాలు దెబ్బతింటాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్లాంట్ల ఓనర్లు బోరు నీళ్లలో కెమికల్స్ కలిపి మినరల్‌వాటర్‌గా అమ్ముతున్నట్టు విమర్శలూ ఉన్నాయి.
వ్యాధులు సంక్రమిస్తాయి
డాక్టర్ వెంకట్‌రెడ్డి, సిటీ హాస్పిటల్, కరీంనగర్
పరిశుభ్రంగా లేని నీటిని తాగడం వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు ఎక్కువగా ఇబ్బందులు పడతారు. డయేరియా, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ ఏ, డీసెంట్రీ (చీము రక్తంతో విరేచనాలు), కొన్ని సార్లు ప్రాణాపాయం కూడా ఉంటుంది. అందువల్ల నీటి శుద్ధి గురించి అందరూ తెలుసుకోవాలి. టోటల్ డిసాల్వ్ సాలిడ్స్ (టీడీఎస్) 100 నుంచి 300 శాతం లోపు ఉండాలి. ఇది తక్కువైనా, ఎక్కువైనా ఇబ్బందే. ఇలాంటి నీటిని వాడుకోవడం హానికరం.