Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు వారాలపాటు నిర్వహణ
- సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ : సీఎం కేసీఆర్ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సలహాదారులు, ఉన్నతాధికారులతో శనివారం హైదరాబాద్లోని సచివాలయంలో సమావేశమైన ఆయన... వేడుకల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి హదయం ఉప్పొంగేలా, తెలంగాణ ఘనకీర్తి దశదిశలా చాటే విధంగా వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సచివాలయంలో మొదటి రోజు వేడుకలు ప్రారంభమవుతాయి. అదే రోజు మంత్రులు తమ తమ జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలను ప్రారంభిస్తారు. అమరవీరులను స్మరించుకునేందుకు ఒకరోజును ప్రత్యేకంగా మార్టియర్స్ డేగా నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమరుల స్థూపాలను పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించి, గ్రామ గ్రామాన తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ నివాళులర్పిస్తారు. స్వతంత్ర భారత దేశంలో తెలంగాణ కోసం సాగిన తొలిదశ ఉద్యమం మొదలు, రాష్ట్రాన్ని సాధించే వరకూ సాగిన ఉద్యమ చరిత్రను తెలిపేలా డాక్యుమెంటరీని రూపొందించాలని సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడి ప్రభుత్వ పాలన ప్రారంభమైన 2014 జూన్ 2వ తేదీ నుంచి.. 2023 జూన్ 2 వరకు స్వయం పాలనలో సాగిన సుపరిపాలన, సాధించిన ప్రగతిపై మరో డాక్యుమెంటరీ రూపొందించాలని ఆయన సూచించారు. 21 రోజుల పాటు తెలంగాణ సంబురాలు నిర్వహించాలన్న కేసీఆర్.. పిండి వంటలు, ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, జానపదాలు, సంగీత విభావరి, సినిమా-జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీతం, నత్యం, తదితర సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.