Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో ఫలించని తెలంగాణ నేతల ప్రచారం
- వారు ప్రచారం చేసిన చోట్లలో దక్కని గెలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కన్నడనాట తెలుగు ప్రజలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో తెలంగాణ బీజేపీ నేతలు చేసిన ప్రచారం బెడిసికొట్టింది. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు ప్రచారం చేసినచోటల్లా ఆ పార్టీ బొక్కాబోర్లా పడింది. చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ ఈటె గురితప్పింది. ఆయన ప్రచారం చోసి చోట బీజేపీ ఓడిపోయింది. వివేక్, మనోహర్‌రెడ్డి, పలువురు నేతలు కూడా కర్నాటక ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడా నిరాశజనకంగానే ఫలితాలు వచ్చాయి. బండి ప్రచారం చేసిన ఒక్కచోట కూడా ఆ పార్టీ అభ్యర్థులు గెలువలేదు. కొన్ని ప్రాంతాల్లోనైతే ఐదో స్థానానికి పడిపోయిన దుస్థితి నెలకొంది. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఐదు నియోజకవర్గాల్లో బండి సంజరు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ఐదింటిలోనూ బీజేపీ ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలువలేకపోయింది. అక్కడ బీజేపీకి మరీ దారుణమైన ఫలితాలు ఎదురయ్యాయి. గౌరీబిదనూర్‌లో బీజేపీ అభ్యర్థి హెచ్ఎస్.శశిధర కుమార్‌కు కేవలం 8 వేల ఓట్లే పడ్డాయి. అక్కడ ఆ అభ్యర్థి ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు. ముల్బగల్లో అక్కడ గెలిచిన జేడీఎస్ అభ్యర్థికి 94,254 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి సుందర్రాజ్ 9 వేల ఓట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ రెండు చోట్లా బీజేపీకి డిపాజిట్ దక్కలేదు. చింతామణిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్సీ సుధాకర్‌కు 97,324 ఓట్లు పోలవ్వగా..బీజేపీ అభ్యర్థికి 21,711 ఓట్లే వచ్చాయి. బాగేపల్లిలో బీజేపీ అభ్యర్థి మునిరాజు 20వేల పైచిలుకు ఓట్లతో పరాజయం పాలయ్యాడు. చిక్బల్లాపూర్లోనూ బీజేపీ అభ్యర్థి 11 వేల ఓట్లతో ఓడిపోయాడు. ఆ నియోజకవర్గాల్లో బండి సంజరు వీధివీధి తిరుగుతూ తెలుగులో మాట్లాడి ప్రచారం చేశారు. ఇక్కడిలాగే అక్కడా ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆయన ఎంత మొరపెట్టుకున్నా కన్నడనాట ఉన్న తెలుగు ఓటర్లు ఆయన్ను ఆదరించలేదు. ఇప్పుడీ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. కర్నాటక ఫలితాలపై శనివారం సాయంత్రం వరకూ నేతలెవ్వరూ స్పందించకపోవడంపైనా చర్చనీయాంశం అవుతున్నది. బండి ఎక్కడికెళ్లినా విద్వేషపు ప్రసంగం, రెచ్చగొట్టే కామెంట్స్ చేయడం ఇంకొకటి ఉండదనీ, ఆయా నియోజకవర్గాల్లో వచ్చే ఓట్లు కూడా కాంగ్రెస్‌కే పోయాయని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఇదీ వాస్తవమే. బాగేపల్లిలో బండి మాట్లాడుతూ...కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పాలనలో ఇన్నేండ్లు ఉన్న బాగేపల్లిలో ప్రజలు తాగుబోతులయ్యారనీ, అభివృద్ధే చేయలేదని వ్యాఖ్యానించారు. ఇది అక్కడి బీజేపీ అభ్యర్థికి ప్రతిబంధకంగా మారింది. మా ప్రాంతానికొచ్చి మమ్ముల్నే తాగుబోతులు అంటారా? అని చర్చనీయాంశం కూడా అయ్యింది. ఇదీ బండి రేంజ్..ఆయన ప్రచారం చేస్తే మినిమమ్ ఇట్లుంటంది అని సోషల్‌మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి.