Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో కేసీఆర్ ఉండగా.. కాంగ్రెస్, బీజేపీలకు చోటే లేదు :మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అభివృద్ధిని మరిచి మతాలు, దేవుని పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీకి కర్నాటక ఫలితాలు చెంపపెట్టులాంటివని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కర్నాటకలో 40 శాతం కమిషన్, అవినీతి పాలన వారిని నిండాముంచిందని తెలిపారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ..దేశ సంపద అంతా మోడీ దోస్త్ అదానీకి దారాదత్తం చేస్తూ...అక్రమంగా వచ్చిన సొమ్ముతో ప్రభుత్వాలను కూలుస్తు నీచాతినీచ రాజకీయాలకు ఒడిగట్టారని విమర్శించారు. ప్రజల పట్ల వైషమ్యాలు రెచ్చగొట్టి,దేశ భద్రతనే గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అసమర్థ,అవినీతి పాలన వల్ల సిలిండర్ ధర,పెట్రోల్,డీజిల్,నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యులు అరిగోస పడుతున్నారని తెలిపారు. కర్నాటక ప్రజలు ప్రభుత్వంపైన తీవ్ర వ్యతిరేకతతో ప్రత్యామ్నాయ పార్టీ అయిన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని పేర్కొన్నారు. అక్కడి ఫలితాలను చూసి తెలంగాణలో ఏమో పొడుస్తామని ఇక్కడి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారనీ, అది వాపు చూసి బలుపు అనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వానికి తప్పా.. కాంగ్రెస్, బీజేపీకి చోటులేదని తెలిపారు. దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసి చూపాలని సవాల్ విసిరారు.