Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'జేపీఎస్'ల అంశంపై తమ్మినేని
- న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జూనియర్ పంచాయతీ కార్య దర్శులు (జేపీఎస్) వెంటనే విధుల్లో చేరాలంటూ రాష్ట్ర ప్రభుత్వం డెడ్‌లైన్ విధించడం అప్రజాస్వామికమని సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ విమర్శించింది. వారి న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిం చాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జేపీఎస్‌లు వారి న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం గతనెల 28వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించకపోగా వారికి డెడ్‌లైన్ విధించి శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోపు విధుల్లో చేరాలని, లేకుంటే వారిని తొలగించి ఆ స్థానంలో కొత్తవారిని నియమించాలంటూ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలివ్వటం అప్రజాస్వామికమని విమర్శించారు. సమ్మె చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కని పేర్కొన్నారు. దాన్ని కాలరాయడం నిరంకుశత్వమని తెలిపారు. ప్రభుత్వం వెంటనే జేపీఎస్‌లను చర్చలకు పిలిచి సమస్య పరిష్కారానికి పూనుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వేలకుపైగా జేపీఎస్‌లు, వెయ్యి మంది వరకు ఓపీఎస్లు పనిచేస్తున్నారని తెలిపారు. వారి ప్రొబెషనరీ పీరియడ్ గతనెల 11వ తేదీతో ముగిసిందని పేర్కొన్నారు. అయినప్పటికీ రెగ్యులరైజ్ చేయకపోవడంతో సమ్మెలోకి దిగారని వివరించారు. జేపీఎస్‌లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. పారిశుధ్యం, ఉపాధి పనులు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, వివాహ సర్టిఫికెట్లు, ఇల్లు కట్టుకునేందుకు అనుమతులు వంటి పనులు నిర్వర్తించడంలో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వ్యవస్థను ఎత్తేయాలంటున్న ప్రభుత్వం, జేపీఎస్‌లను క్రమబద్ధీకరించకుండా సమ్మెలో ఉన్న ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని అల్టిమేటం ఇవ్వడం దురదృష్టకరమని తెలిపారు. జేపీఎస్‌ల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారిని రెగ్యులరైజ్ చేస్తూ జీవోను విడుదల చేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు.