Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిల్లుల్లో దిగుమతి జాప్యంపై ఆవేదన
- తరుగు దోపిడీపై ఆగ్రహం
నవతెలంగాణ - శంకరపట్నం/ భువనగిరిరూరల్
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటా.. మిల్లుల్లో దిగుమతి చేసుకోవడంలో జాప్యం, తరుగు పేరుతో దోపిడీపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రేపు మాపంటూ కాంటాలు వేయకుండా జాప్యం చేయడాన్ని నిరసిస్తూ సోమవారం కరీంనగర్, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో రాస్తారోకో చేశారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో వరంగల్ - కరీంనగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కేశవపట్నం వ్యవసాయ మార్కెట్లో, ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన వడ్లను నాలుగు రోజులుగా మిల్లర్లు దించుకోకుండా ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకెపి సెంటర్లలో బస్తాకు రెండు కిలోలు అధికంగా తూకం వేస్తున్నారని చెప్పారు. తూకం వేసిన వడ్లను ట్రాక్టర్ల లోడుతో వస్తే మిల్లర్ల యజమానులు దిగుమతిలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ గూడూరి శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు రాస్తారోకో విరమించారు.
తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కోసి ఆరబెట్టి నాణ్యతతో మిల్లులకు పంపిస్తే, మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత ఉన్న ధాన్యాన్ని బి-గ్రేడ్ అంటూ మోసం చేస్తున్నారని యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మాదారం గ్రామ రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. పంట చేతికి వచ్చేసరికి వరుణుడు నేలపాలు చేశాడన్నారు. మిగిలిన వరిని కోసి కొనుగోలు కేంద్రాలకు తరలించామన్నారు. అక్కడ ధాన్యాన్ని తూర్పారబెట్టిన తర్వాత వ్యవసాయ అధికారులు పరిశీలించి ఏ-గ్రేడు సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పారు. ఈ ధాన్యాన్ని లారీల్లో 750 బస్తాలను కన్యకాపరమేశ్వరి రైస్‌మిల్లుకు పంపించామన్నారు. ఈ మిల్లుకు మాదారం, రామలింగంపల్లి, ఇంద్రియాల గ్రామా లను కేటాయించారన్నారు. మిల్లర్లు ఈ ధాన్యం బాలేదని, బీ-గ్రేడ్‌గా తీసుకుంటామని ఒకసారి, మరోసారి క్వింటాల్‌కు కిలోల తరుగు తీస్తామని బెదిరిస్తున్నారన్నారు. లారీ లోడ్‌కు 7.50క్వింటాళ్ల తరుగు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఈ విషయమై తాము కలెక్టర్‌కు, డీసీఓకు సమాచారం అందిం చామన్నారు. మిల్లరు మాత్రం ''నువ్వు కలెక్టర్ కార్యాల యానికి వెళ్లావు కదా.. నీ లోడ్ అసలే ఖాళీ చేయబోం'' అని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదారం ఐకేపీ కేంద్రానికి మరో మిల్లును కేటాయించాలని కోరారు. వెంటనే కన్యకా పరమేశ్వరి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇన్చార్జి ఆర్.మంగ, బీబీనగర్ పీఏసీఎస్ చైర్మెన్ మెట్టు శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్ మధునాయక్, రైతులు ముత్యాలు, అంజిరెడ్డి, దామోదర్‌రెడ్డి, భగవాన్‌రెడ్డి, కాంతారెడ్డి పాల్గొన్నారు.