Sun 04 Jul 07:57:03.937139 2021
Authorization
ఏది ఏమైనా చలించకుండా ముందుకు పయనించేది కాలం. కాలానికున్న ప్రత్యేకత ఏంటంటే అది సంతోషంలోను, దుఃఖంలోను సమతూకంగానే తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. అలాంటి కాలం విలువ తెలిసిన కవి రావి రంగారావు.
క్యాలెండర్లు ఏ మాత్రం జీవితాలకు ప్రామాణికం కాదంటారు, ఎన్ని క్యాలెండర్లు మారినా బతుకులు మారవంటూ మనుషుల బాధ్యతను గుర్తుచేస్తాడు. ప్రస్తుత మనుషుల జీవన స్థితిని దష్టిలో పెట్టుకొని నేటి సమాజాన్ని చైతన్యపరిచే అంశాలను కవితల్లో జోడిస్తాడు.
ఈ కొత్త క్యాలెండర్ లో ప్రేరణను పెంపొందించేవి, జీవిత పరమార్థాన్ని తెలియజేసేవి, అన్యాయాన్ని ఎదురించేవి, స్వచ్చమైన జీవితానికి దారిచూపేవి, పరిమళాన్ని నింపేవి, పిట్టను చెట్టును మరిచిపోకుండా చేసేవి, ప్రశ్నలై మొలిచే మొదలగు అంశాలతో కూడిన కవితలు రాశారు.
పుస్తకానికి పెట్టిన ''కొత్త క్యాలెండర్'' శీర్షికే కాక ఇందులో ఎన్నో వినూత్నమైన కవితా శీర్షికలున్నాయి.ఎండను తాగే రాత్రి, డాక్టర్ సూర్యుడు, కంపు పూలగాలి, ఒక్క కుక్క అరవటం లేదు వంటివి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. చక్కని భావుకత, సామాజికత, తాత్వికత, మానవీయత కలగలిసిన చిక్కని కవిత్వంగా ''కొత్తక్యాలెండర్''ను చెప్పవచ్చు.
వెంటాడే వాక్యాల్లోకి..
1. ఒక్క క్షణం చాలు-కళ్ళు మూతపడితే
వెలుతురు కుంటిది కావచ్చు
చీకటి కుర్చీ ఎక్కొచ్చు (ఒక్క క్షణం చాలు, పేజీ12)
ఈ వాక్యాల్లో వెలుతురును అభివద్ధికి చిహ్నంగా, చీకటిని అర్హతలేని నాయకునికి గుర్తుగా ఉపయో గించారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్న ప్రజా స్వామ్య వ్యవస్థను కవిత్వంగా చెప్పటం కోసం కవి రాసిన ఈ వాక్యాలు సులువుగా పాఠకునికి చేరుతాయి. ఇందులో సాధారణ పదాలతో కూడిన బలమైన వ్యక్తీకరణ ఉన్నది.
2. ఔషధమైనా విషమైనా
మనసులోంచే తయారయ్యేది!
మనసులో పుట్టేదే
బతుకుంతా పాకేది! (మనసు,పేజీ 59)
మనసనేదే అన్నింటికి మూలం. మనిషి చెడుమార్గంలో నడవాలన్న, సన్మార్గంలో నడవాలన్న మనసే ముఖ్యం. మనసు భాష అంత సులువుగా అర్థం కాదు. ఒక్కసారి అర్థమయితే చివరివరకు వదిలిపోదు. అందుకే కవి మనసు తీవ్రతను తెలియజేసే ఈ వాక్యాలనుంటాడు. మనసులో పుట్టిన చెడు ఆలోచనలే విషంగా మారి నష్టాన్ని కలిగిస్తాయని, మనిషిని బాగు పరిచే మందుగా కూడా మనసే పనిచేస్తుందని.
3. పుస్తకాన్ని తెరవటమంటే
ఇంట్లో ఉన్నా కోట్ల జనాల్లోకి వెళ్ళటమే
కాదు కదలకుండానే
కమనీయ ప్రపంచాన్ని చుట్టి రావటమే..
(పుస్తకం ఒక సముద్రం,పేజీ 86)
పుస్తకం విశిష్టతను మూడే వాక్యాల్లో ఎంతో గొప్పగా చెప్పారు.పుస్తకాన్ని ప్రపంచంలోపలికి వెళ్ళటానికి ద్వారంగా అభివర్ణించారు. పుస్తకాలను చదివితే ఇంట్లో కూర్చొనే ప్రపంచాన్ని చుట్టిరావచ్చొంటారు. పుస్తకం విలువను తెలియజేసే ఈ వాక్యాలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకో దగినవి. ఈ వాక్యాలు పుస్తకాలు చదువుతున్న వారికి బలాన్నిచ్చేవి, చదవని వారికి కనువిప్పు కలిగించేవి.
4. ప్రశ్న ఒక అగ్గిపుల్ల
సరిగా వినియోగించు
ప్రశ్న ఒక ఆడపిల్ల
సున్నితంగా గౌరవించు!
(ప్రశ్న ఒక వెలుతురు,పేజీ 94)
ప్రశ్న అనేది ఎంతో గొప్ప సాధనం. అది లేకపోతే జవాబు చెప్పే వాడెవడు ఉండడు. జీవితం ప్రశ్నగానే మిగిలిపోతుంది. కవి కూడా మొదటి వాక్యంలో ప్రశ్నను అగ్గిపుల్ల అన్నారు. నిజంగా అది అక్షరాల సత్యం. ప్రశ్నై పేలని మనుషులన్నంత కాలం అవినీతే రాజ్యమేలుతుంది. ఈ రోజుల్లో ప్రశ్నగా మిగులుతున్న ఆడపిల్లల జీవితాలనుద్దేశించి ప్రశ్నొక ఆడపిల్లన్నారు. ఈ వాక్యాల్లో సున్నితత్వం కనిపించిన కాస్త లోతుల్లోకి వెళితే బలమైన ప్రశ్నించే గొంతుక కనబడుతుంది.
వీరు కవిత్వమే కాకుండా మినీ కవితలు, బాల గేయాలు, కిరణాలు, పద్యాలు, వ్యాసాలు కూడా రాశారు. మినీ కవితల పితామహుడుగా ప్రసిద్ధి గాంచారు. ఉత్తమ పరిశోధకులు కూడా.
- తండ హరీష్ గౌడ్,
సెల్: 8978439551