Sun 10 Jul 07:00:00.764349 2022
Authorization
ఐఐటీకి చిన్నప్పటి నుండీ శిక్షణ ఇచ్చే, పెద్ద ఊరిలోని గొప్ప స్కూలు ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఆనంత్కు సీటు రాలేదు. దానితో అతని తలిదండ్రులు అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. పది సంవత్సరాల వయసున్న అనంత్ను తెగ తిట్టిపోస్తున్నారు
గొప్ప స్కూలు ప్రధాన కేంద్రం పెద్ద ఊరిలో ఉంటుంది. ప్రతి ఊళ్ళోనూ ఆ స్కూలు శాఖలు ఉంటాయి. ఆ స్కూలు శాఖలలో అయిదో తరగతి వరకు చదివిన పిల్లలకు, ప్రధాన స్కూల్లో ఆరవ తరగతిలో ప్రవేశం కొరకు, ప్రతి సంవత్సరం ప్రవేశ పరీక్ష పెడతారు. కొంత మందిని ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన వాళ్ళు ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకు అక్కడే హాస్టల్లో ఉండి చదువుకోవాలి. బోలెడంత ఫీజు కట్టాలి. ఆరో తరగతిలో అక్కడ సీటు దొరికితే ఐఐటీలో సీటు, విదేశీ ఉద్యోగం, కోట్లు సంపాదించటం ఖాయం అనుకుంటారు పిల్లల తల్లిదండ్రులు. అందుకే అందరూ ఎగబడతారు - సాధించేది కొద్ది మందే అయినా.
''స్కూలు ఫస్ట్ అయిన నీకు ప్రవేశపరీక్షలో సీటు రాకపోవటం ఏంటి? నలుగురిలో మా పరువు పోయింది. లక్షలు ఖర్చు పెట్టి అయిదవ తరగతి వరకూ చదివించాం. ఆ డబ్బంతా వధా'' ఆ రోజు పగలూ రాత్రి అనంత్ను అతని తల్లిదండ్రులు తిడుతూనే ఉన్నారు.
మర్నాడు పొద్దున్నే మళ్ళీ తిట్టటానికి అనంత్ గదిలోకి వెళ్ళారు అతని తల్లిదండ్రులు. అనంత్ అక్కడ లేడు. ఇల్లంతా, ఊరంతా వెదికారు. కనబడలేదు. మధ్యాహ్న సమయంలో అనంత్ తాతగారు అనంత్ తండ్రికి ఫోన్ చేశారు - అనంత్ తన దగ్గరికి వచ్చాడని.
రెండు గంటల్లో అనంత్ తల్లిదండ్రులు అనంత్ ఉన్న ఊరికి వెళ్లారు. తాతయ్యతో కబుర్లు చెబుతూ నవ్వుతూ కూర్చున్న అనంత్ తన తల్లిదండ్రులను చూడగానే ఒక్కసారిగా భయపడిపోయాడు. తాతయ్య వెనక్కెళ్ళి దాక్కున్నాడు.
అక్కడకు వెళ్లీవెళ్లగానే ఆనంత్ను తిట్టటం మొదలెట్టారు అనంత్ తల్లిదండ్రులు. ''నేను ఇంకా బతికి ఉండబట్టి వాడు మీ దగ్గర నుండి పారిపోయి నా దగ్గరికి వచ్చాడు. అదే నేను లేకపోతే వాడు ఎక్కడికి పోయేవాడో ఒక్కసారి ఆలోచించండి'' అన్నారు అనంత్ తాతగారు. దానితో అనంత్ తల్లిదండ్రులు అనంత్ను తిట్టటం ఆపారు.
''స్కూలు ఫస్ట్ విద్యార్థి అయిన వాడికి ప్రవేశ పరీక్షలో సీటు ఎందుకు రాలేదో మాకు తెలియాలి'' అడిగారు అనంత్ తల్లిదండ్రులు.
అనంత్ను తన ఒడిలో కూర్చోబెట్టుకొని ''మీ అమ్మానాన్న అడిగిన దానికి సమాధానం చెప్పు'' బుజ్జగిస్తూ అడిగారు అనంత్ తాతగారు.
''కావాలనే నేను పరీక్ష సరిగా రాయలేదు'' చెప్పాడు ఆనంత్. అందరూ ఆశ్చర్యపోయారు.
''ఎందుకని?'' అడిగారు అనంత్ తల్లిదండ్రులు కోపంగా.
''అమ్మా, నాన్నా... మీరంటే నాకు ఎంతో ఇష్టం. మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను. కనీసం పదో తరగతి వరకు అయినా నేను మీ దగ్గరే ఉండి చదువుకుంటాను. ఆ తర్వాత మీరు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళి చదువుకుంటాను. ఇప్పుడు మాత్రం మీకు దూరంగా ఉండలేను. అందుకే కావాలనే నేను పరీక్ష సరిగా రాయలేదు. నేను బాగా చదివేవాడినే కదా. చదవకుండా అల్లరిచిల్లరిగా తిరిగే వాడిని కాదు కదా. నన్ను హాస్టల్ కు పంపొద్దు. నన్ను మీ దగ్గరే ఉండనివ్వండి'' ఏడుస్తూ చేతులు జోడించి నమస్కరించి చెప్పాడు అనంత్
అనంత్ తల్లిదండ్రులు మౌనంగా ఉండిపోయారు
''పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులకు జాగ్రత్త, ఆశ, ఆలోచన ఉండాలి. కానీ గొప్ప చదువు పేరుతో మరీ చిన్నతనం నుంచే పిల్లలను తల్లిదండ్రులకు దూరంగా ఉంచటం మంచిది కాదు. మరీ చిన్నతనం నుంచీ తల్లిదండ్రులకు దూరంగా ఉన్న పిల్లలకు తల్లిదండ్రుల మీద సరైన ప్రేమ ఉండదు. అలాంటి పిల్లలు పెరిగి పెద్దయ్యాక ముసలివాళ్ళయిన తమ తల్లిదండ్రులను వద్ధాశ్రమంలో వదిలేయటాన్ని తప్పు అనుకోరు. ఆశ్రమంలో అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయి కాబట్టి వాళ్ళ అక్కడ ఉంచటమే సరైనపని అనుకుంటారు. నెలనెలా ఆశ్రమానికి డబ్బు కడుతూ తల్లిదండ్రుల పట్ల బాధ్యతగానే ఉంటున్నాం అనుకుంటారు. తల్లిదండ్రులు ఉండి - మరీ చిన్నతనంలోనే హాస్టల్లో ఉండే పిల్లల బాధ, కన్న పిల్లలు ఉండి - వద్ధాశ్రమంలో ఉండే తల్లిదండ్రుల బాధ - ఒక్కటే'' చెప్పటం ముగించారు తాతగారు
ఆనంత్ తల్లిదండ్రులు అనంత్ను దగ్గరకు తీసుకున్నారు. అనంత్ కోరినట్టుగానే అతన్ని చదివించాలని నిర్ణయించుకున్నారు.
మరో వారం రోజుల్లో అనంత్ తాతగారిని ఆ వద్ధాశ్రమం నుండీ తమ ఇంటికి తీసుకెళ్లారు అనంత్ తల్లిదండ్రులు.
- కళ్ళేపల్లి తిరుమలరావు,
9177074280