Sat 16 Jul 23:47:48.439914 2022
Authorization
రామాపురంలోని రాముడన్న, భీమాపురంలోని భీముడన్న అందరికీ గౌరవం. అప్పుడెప్పుడో ఇరువురు చెరో ఊరిలో ఉంటూ ఎన్నో సమస్యలు పరిష్కారం చేశారని చెబుతుంటారు. అందుకనే వారి పేర్లతోనే రామాపురం, భీమాపురం అనే గ్రామాలు వెలిశాయి. ఇరువురు ఒకరినొకరు చూసుకున్నది లేదు. ఏనాడు ఇద్దరూ ముఖాముఖి కలిసింది లేదు. దానికి తోడు రెండు ఊర్లల్లోనూ ఎటువంటి కలతలు ఉండేవి కావు. కలతలున్నా అవి రాముడు, భీముడు తీర్చే వారు. పోలీసులు ఆ ఊర్లో అడుగు పెట్ట లేదంటే దానికి కారణం వారిద్దరే. ఇప్పుడు వాళ్ళు కనుమరుగైనారు. వారి వారసులు రామప్ప, భీమప్ప వచ్చారు. వాస్తవానికి వారి పేర్లు రామకుమార్, భీమేష్ కుమార్. ఊర్లో అందరూ రామప్ప, భీమప్ప అనే పిలిచే వారు.
ఒక రోజు రామాపురం గ్రామానికి, భీమాపురం గ్రామానికి మంచినీటి సమస్య వచ్చి పడింది. రెండు ఊర్లకు మధ్యలో ఒకే బావి ఉంది. ఆ బావిని మా ఊరి రాముడు తవ్వించాడు అంటే, కాదు మా భీముడు తవ్వించాడు అని గ్రామస్తులు వాదులాడు కునేవారు. ఆ బావిలోని నీరు మాకే హక్కు అని రెండు గ్రామాలు తీవ్రంగా కలహించుకుని ఎవరు నీరు వాడకుండా బావి చుట్టూ ముళ్ళ కంప కొట్టారు. ఫలితంగా మంచి నీరు కొనుక్కొని తాగే వారు. ఇది నచ్చలేదు రామప్ప, భీమప్పకు. మన తల్లిదండ్రులు ఉన్న సమయంలో అందరూ బాగున్నారు. ఇప్పుడేమిటి ఇలా నీటి కోసం వాదులాట అనుకుని ఇద్దరూ వారి తల్లిదండ్రులు సమాధి దగ్గరకు వెళ్ళాలని తీర్మానించు కున్నారు. దారిలో ఇద్దరూ ఒకరి కొకరు ఎదురు పడ్డారు. ''మీరు'' అని రామప్ప అడగగా, ''మీరు'' అని బీమప్ప కూడా అడిగాడు. అలా వారు పరిచయం చేసుకున్నారు. ''నేను మా తండ్రి సమాధి దగ్గరకు వెళ్ళి వస్తాను'' అని రామప్ప అంటే, ''నేను కూడా మా తండ్రి సమాధి దగ్గరకు వెళ్ళొస్తాను, మళ్ళీ ఇద్దరం ఇక్కడే ఈ వేప చెట్టు కింద కలుద్దామని వెళ్ళారు. ఓ అర గంటకు ఇద్దరూ వేప చెట్టు కింద చేరారు.
''ఆ బావి మన పూర్వీకులు ఎప్పుడో తవ్వారట దానికి పరిష్కారం తగవు కాదు. మంచి మాట చెప్పాలి అని మా నాన్న అంతరాత్మ చెప్పింది'' అన్నాడు రామప్ప. దానికి భీమప్ప నవ్వి ''నాకు మా నాన్న గారి అంతరాత్మ నాతో కూడా రెండు ఊర్లకు మంచి పని చేయి'' అని చెప్పాడు అన్నాడు భీమప్ప. మరి మనమిద్దరం మన నాన్నగార్ల పేరు నిలబెట్టాలి. అసలు ఎప్పుడు తగవు రాకూడదు అనుకుని ఓ మోటార్ బిగిద్దాం. వచ్చే కరెంట్ బిల్లు చెరి సగం కడదాం.
మన తండ్రుల పేరు నిలబడుతుంది. వారి ఆత్మలు శాంతిస్తాయి'' అన్నాడు రామప్ప.
''సరే'' అని చేతిలో చేయి వేశాడు భీమప్ప.
అలా వారి ఊరి పేర్లు కాకుండా రాముడు, భీముడు అనే పేర్లే చిరస్థాయిగా నిలబడ్డాయి.
- కనుమ ఎల్లారెడ్డి, 93915 23027