Sat 17 Dec 22:45:07.252605 2022
Authorization
అది ఒక చిన్న ఊరు. ఆ రోజు ఆదివారం. ఉదయం పది గంటల సమయం. ఊరి బయట చింత చెట్టు నీడలో పిల్లలు ఆడుకుంటున్నారు. సూర్య, రవి ఏడవ తరగతి చదువు తున్నారు. సూర్య ఒక పెద్ద కర్రతో చింతకాయలు రాలగొట్టాడు. కిందపడిన చింతకాయలను గభాలున తీసుకున్నాడు రవి. సూర్యను వెక్కిరిస్తూ చింతకాయలతో పరిగెత్తసాగాడు. ''అరే, అవి నా కాయలు'' అంటూ రవిని వెంబడించాడు సూర్య. కొంత దూరం వెళ్లేసరికి కాలికి ఎదురుదెబ్బ తగిలి కింద పడిపోయాడు రవి. అతని మోకాళ్ళు, మోచేతులు కొట్టుకుపోయి రక్తం కారసాగింది. రవి ఏడుస్తూ తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. రవి శరీరం నుండి కారుతున్న రక్తాన్ని చూడగానే రవి తండ్రికి విపరీతమైన కోపం వచ్చింది. కారణం కనుక్కున్నాడు. సూర్యని దబదబా నాలుగు బాదాడు రవి తండ్రి. సూర్య ఏడుస్తూ తన తండ్రి దగ్గరకు వెళ్ళి చెప్పాడు. సూర్య తండ్రి, రవి తండ్రి వద్దకు వచ్చి ''నా కొడుకుని ఎందుకు కొట్టావు?'' అని అతన్ని నిలదీశాడు. ''నీ కొడుకు వల్ల నా కొడుకు పడిపోయాడు. గాయాలయ్యాయి. రక్తం ఎలా కారుతుందో చూడు'' అని అరిచాడు రవి తండ్రి. ఇద్దరూ గొడవ పడుతుంటే అక్కడున్న వారు ఆపారు. రవి తండ్రి ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా సూర్య కుటుంబాన్ని రచ్చకీడ్చాడు. సాయంత్రం ఊరి పెద్ద ముందు విషయాన్ని ఉంచాడు రవి తండ్రి. ''సూర్య కారణంగా నా కొడుకుకి రక్తం కారి గాయాలయ్యాయి. సూర్య కుటుంబం వైద్య ఖర్చులకు నాకు డబ్బు ఇవ్వాలి. సూర్య తండ్రి నాకు క్షమాపణ చెప్పాలి'' అన్నాడు రవి తండ్రి. రవి తండ్రి పక్షం వాళ్ళందరూ అతనికి వంత పాడారు
''నా కొడుకును రవి తండ్రి కొట్టటం తప్పు. అలా కొట్టకుండా ఉంటే నేను రవి వైద్య ఖర్చులకు డబ్బులు ఇచ్చేవాడిని. ఇప్పుడు నేను ఇవ్వాల్సిందేమీ లేదు'' చెప్పాడు సూర్య తండ్రి. సూర్య తండ్రి పక్షం వాళ్ళు దానిని సమర్థించారు. దానితో అరుపులు కేకలు మొదలయ్యాయి. చిన్న తగాదా కాస్త చిలికి చిలికి గాలి వానగా మారసాగింది. అంతలో సూర్య,రవిలతో పాటుగా ఆ రోజు ఉదయం చింత చెట్టు కింద ఆడిన పిల్లల్లో ఒక పిల్లవాడు ఊరిపెద్ద దగ్గరకు వచ్చి ''దయచేసి నేను చెప్పేది వినండి. రవి కింద పడటంలో సూర్య తప్పేమీ లేదు. వాళ్ళిద్దరూ ఆటకాయితనంగా పరిగెత్తారు. ఎదురుదెబ్బ తగిలి రవి కిందపడ్డాడు. కాళ్ళు చేతులు కొట్టుకుపోయి రక్తం వచ్చింది. సూర్య రవిని ఏమీ చేయలేదు. ఇది నిజం'' అన్నాడు. ''అవును ఇది నిజం. మేము అందరం అప్పుడు అక్కడే ఉన్నాం'' అన్నారు మిగిలిన పిల్లలు. ఊరిపెద్దకు, అక్కడ ఉన్న జనానికి విషయం అర్థమయింది.
ఇంతలో అక్కడ గుమిగూడిన జనంలో నుంచి ఒక ముసలాయన ముందుకు వచ్చి ''ఆటలలో అనుకోకుండా దెబ్బలు తగలడం సహజం. జాగ్రత్తగా ఆడుకోమని పిల్లల్ని మందలించాలి. అది చేయకుండా పిల్లలకు బుద్ధి చెప్పాల్సిన పెద్దలే ఇలా బుద్ధి లేకుండా గొడవ పడటం సిగ్గుచేటు'' అన్నాడు. ముసలాయన మాటలకు రవి తండ్రి, సూర్య తండ్రి తలలు దించుకున్నారు. ఊరి పెద్ద వాళ్ళను మందలించి పంపాడు. నిజం చెప్పి - గొడవ హింసగా మారి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగకుండా చేసిన పిల్లల బాధ్యతాయుత ప్రవర్తనను అందరూ అభినందించారు.
- కళ్ళేపల్లి తిరుమలరావు, 9177074280