Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. వారు జరిపిన బాంబు పేలుడులో ఐదుగురు సైనికులు మృతి చెందారు. మరో జవాను చికిత్స పొందుతున్నాడు. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కు పేలి ఐదుగురు సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. జవాన్లతో వెళ్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేయడంతో ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. ఆ ఘటనకు పాల్పడిన ముష్కరులు కాండి ఫారెస్ట్‌లోని ఓ గుహలో ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి ఆర్మీకి సమాచారం అందింది. దాంతో గురువారం నుంచి బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. శుక్రవారం ఉదయం ఉగ్రవాదుల జాడ గుర్తించడంతో.. ఇరువైపులా ఎన్కౌంటర్ మొదలైంది. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు పేలుడు పదార్థాన్ని ఉపయోగించారు. ఆ ఘటనలో ఇద్దరు ఆర్మీ అధికారులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఉధంపుర్లోని కమాండ్ ఆసుపత్రికి తలించారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఉగ్రవాదులు ఆ ప్రాంతంలోనే దాక్కొని ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజౌరీ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.