Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఒక కుటుంబానికి చెందిన ఆరో తరగతి విద్యార్థినిని ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యగా తన ఇంట్లో ఉంచుకున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీహార్లోని సివాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఒక కుటుంబం, మహేంద్ర పాండే అనే వ్యక్తి నుంచి రూ.2 లక్షలు అప్పుగా తీసుకుంది. అయితే సకాలంలో ఆ డబ్బు చెల్లించలేకపోయింది. దీంతో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిని అతడు తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ బాలికను చదివిస్తానని ఆ కుటుంబానికి చెప్పిన అతడు మూడు నెలల కిందట గుట్టుగా ఆమెను బాల్య వివాహం చేసుకున్నాడు. రెండో భార్యగా తన ఇంట్లో ఉంచుకున్నాడు. కాగా, దూరపు బంధువైన మహేంద్ర పాండే తమ కుమార్తె అయిన మైనర్ బాలికను రహస్యంగా బాల్య వివాహం చేసుకుని రెండో భార్యగా చూస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బాల్య వివాహ చట్టం, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహేంద్ర పాండేను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. ఆ బాలిక మూడు నెలలపాటు అతడి ఇంట్లో ఉండటంతో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు. మరోవైపు ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.