Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపానుతో ఏపీకి ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) పేర్కొంది. ఐఎండీ అంచనాల ప్రకారం రేపు (మే 6) ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడనుందని, ఇది అల్పపీడనంగా మారుతుందని వెల్లడించింది. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా మారి, ఆ తర్వాత ఉత్తర దిశగా మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుపానుగా మారే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. అయితే, ఈ తుపాను మయన్మార్, బంగ్లాదేశ్ తీరాల వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, ఏపీపై దీని ప్రభావం ఉండకపోవచ్చని వివరించింది. అయినప్పటికీ, మత్స్యకారులు ఆదివారం నుంచి సముద్రంలో వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు రేపటిలోగా తిరిగి రావాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు, దక్షిణ కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీనిపై ప్రభావంతో ఏపీలో మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.