Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు వేర్వేరు విభాగాల్లో 5,204 స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయడానికి వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ (టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) గత ఏడాది డిసెంబరులో నియామక ప్రకటనను విడుదల చేసింది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని, ఓఎంఆర్ షీట్ విధానంలో జవాబుపత్రం ఉంటుందని ఆ నియామక ప్రకటనలో వెల్లడించారు. అయితే ఇటీవల ప్రశ్నపత్రాల వరుస లీకేజీ ఘటనల దృష్ట్యా... రాతపరీక్ష విధానానికి స్వస్తి చెప్పాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. నర్సింగ్ పోస్టుల భర్తీలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను నిర్వహించాలని ఇటీవల వైద్య మంత్రి హరీశ్‌రావు వద్ద జరిగిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎంసెట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలను ఎలాగైతే కంప్యూటర్ ఆధారంగా నిర్వహిస్తున్నారో... అదే తరహాలో నర్సింగ్ పోస్టుల భర్తీ పరీక్షను కూడా నిర్వహించాలని తీర్మానించారు. నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో ప్రశ్నపత్రాన్ని జేఎన్టీయూ రూపొందించనుండగా... ఆన్లైన్లో పరీక్షల నిర్వహణలో అపార అనుభవమున్న ఓ సంస్థకు నర్సుల పోస్టుల నియామక పరీక్ష నిర్వహణ బాధ్యతను అప్పగించారు. వచ్చే వారంలో నియామక పరీక్షకు సంబంధించిన తేదీని టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ప్రకటించనుంది. పరీక్ష ప్రకటన తేదీకి.. నిర్వహణ తేదీకి మధ్య కనీసం రెండు నెలలు ఉండేలా ప్రణాళిక రూపొందించింది. జులైలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత సంస్థకు వైద్యశాఖ సూచించింది.