Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఓ ఆడియో క్లిప్ మరోసారి కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను హతమార్చేందుకు బీజేపీ అభ్యర్థి కుట్ర పన్నారంటూ ఆ పార్టీ ఆరోపించింది. సంబంధిత ఆడియోను పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా విడుదల చేశారు.
కర్ణాటకలోని కలబురగి జిల్లా చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ మాట్లాడినట్లుగా ఉన్న ఆడియోను సూర్జేవాలా విలేకరుల సమావేశంలో వినిపించారు. 'ఖర్గేతో పాటు ఆయన భార్య, పిల్లలను కూడా అంతమొందిస్తా' అని రాథోడ్ కన్నడలో అన్నట్లుగా ఆడియో ఉంది. దీనిపై సూర్జేవాలా మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి భయంతో హత్యకు సైతం బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
తనపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను రాథోడ్ ఖండించారు. కాంగ్రెస్ చెప్తున్నవన్నీ అబద్ధమని, అది ఓ ఫేక్ ఆడియోగా కొట్టిపారేశారు. ఓటమి భయంతోనే లేని అభాండాలు మోపుతున్నారని ఆరోపించారు. చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే పోటీ చేస్తుండగా.. ఆయనపై 26 ఏళ్ల మణికంఠ రాథోడ్‌ను బీజేపీ బరిలో నిలిపింది. మే 10న కర్ణాటకలోని అన్ని స్థానాలకు పోలింగ్ జరగనుంది.