Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లాహోర్
ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరంజిత్ సింగ్ పంజ్వర్ వురపు మాలిక్ సర్దార్ సింగ్ శనివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. పాకిస్థాన్‌లోని లాహోర్, జోహర్ పట్టణంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఆయన ఉదయం 6 గంటలకు తన ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆయన డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జోహర్ పట్టణంలోని సన్‌ఫ్లవర్ సొసైటీలో తన ఇంటికి సమీపంలో పరంజిత్ శనివారం ఉదయం 6 గంటలకు వాకింగ్ చేస్తున్నారు. ఆయనతోపాటు ఆయన గన్‌మన్ కూడా ఉన్నారు. అదే సమయంలో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి ఆయనను హత్య చేశారు. ఈ దాడిలో గాయపడిన గన్‌మన్‌ను ఆసుపత్రికి తరలించారు. దుండగులు మోటారు బైక్‌పై వచ్చారు.
పరంజిత్ మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కేసుల్లో నిందితుడు. మన దేశంలోని పంజాబ్‌లోకి డ్రోన్ల ద్వారా అక్రమంగా మాదక ద్రవ్యాలను, ఆయుధాలను పంపిస్తుండేవాడు. ఈయన తరన్ తరన్ సమీపంలోని పంజ్వర్ గ్రామంలో జన్మించాడు. తన కజిన్ లాభ్ సింగ్ బ్రెయిన్‌వాష్ చేయడంతో 1986లో ఖలిస్థాన్ కమాండో ఫోర్స్‌లో చేరాడు. అంతకుముందు ఆయన సోహల్లో ఓ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులో పని చేసేవాడు. లాభ్ సింగ్‌ను భారత భద్రతా దళాలు మట్టుబెట్టిన తర్వాత కేసీఎఫ్ బాధ్యతలను పంజ్వర్ చూసేవాడు. ఈ నేపథ్యంలో ఆయన పాకిస్థాన్‌కు పారిపోయాడు. పాకిస్థాన్ ఆశ్రయంలో ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో పంజ్వర్ ఒకడు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా ద్వారా వచ్చే నిధులతో కేసీఎఫ్‌ను నడుపుతున్నాడు. పంజ్వర్ తమ దేశంలో ఉన్నాడనే ఆరోపణలను పాకిస్థాన్ ఖండిస్తోంది. ఆయన భార్య, పిల్లలు జర్మనీలో ఉంటున్నారు.