Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మండిపోతోంది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఎస్టీ రిజర్వేషన్ అంశం తీవ్రమైన చిచ్చు రగిల్చింది. రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 54 మంది మరణించారు. ఓ బీజేపీ ఎమ్మెల్యేపై దాడి జరగ్గా, ఆయన పరిస్థితి విషమంగా ఉంది. మణిపూర్ లో శాంతిభద్రతలను అదుపులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం ఆర్మీ, ఆర్ఏఎఫ్, ఇతర పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. కాగా, మణిపూర్ లో హింస ప్రజ్వరిల్లుతుండగా, తెలుగు విద్యార్థులు భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటున్నారు. మణిపూర్ లోని ఇంఫాల్ ఎన్ఐటీ విద్యాసంస్థలో 150 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉన్నారు. మణిపూర్ లోని అనేక ప్రదేశాల్లో ఇప్పుడు అడుగు బయటపెట్టే పరిస్థితి లేకపోవడంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. తినడానికి సరైన తిండి కూడా లేదని, ఆకలితో అలమటిస్తున్నామని వారు వాపోయారు. ఈ మేరకు ఓ వీడియో పోస్టు చేశారు.
కాగా ఇంఫాల్ ఎన్ఐటీలో ఉన్న ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అధికారులు అతి కష్టమ్మీద ఒక పూట భోజనం అందిస్తున్నట్టు తెలుస్తోంది. విద్యాసంస్థ ప్రాంగణంలో తాగునీరు కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు జామర్లు ఏర్పాటు చేయడంతో సెల్ ఫోన్లు పనిచేయక విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడలేకపోతున్నట్టు వెల్లడైంది. మణిపూర్ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం వారి సొంత స్థలాలకు చేర్చింది. సాయపడే వాళ్లు లేక ఇతర రాష్ట్రాల విద్యార్థులు హాస్టళ్లకే పరిమితం అయ్యారు.
మణిపూర్ లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, మణిపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తమ పిల్లలను మణిపూర్ నుంచి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.