Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అంగీకారంతో తెలంగాణలో మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పిల్లలకు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ విద్యే కాకుండా సంగీత విద్య కూడా ప్రాధాన్యంగా ఉండాలన్న కేటీఆర్... రాష్ట్రంలో మ్యూజిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'మ్యూజిక్ స్కూల్' చిత్రం ఈ నెల 12న విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ముందస్తు విడుదల వేడుకకు సంగీత దర్శకుడు ఇళయరాజాతో కలిసి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... మ్యూజిక్ యూనివర్సిటీ లాంటి వ్యక్తి ఇళయరాజాతో కలిసి వేదిక పంచుకోవడం గౌరవంగా ఉందన్నారు. ఇళయరాజా అంగీకరిస్తే తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. వెంటనే పక్కనే ఉన్న ఇళయరాజా స్పందిస్తూ.. తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ ఎంతో చేస్తున్నారని, మంత్రే వచ్చి ప్రజలను వరాలు కోరుకొమ్మని అడగడం ఆనందంగా ఉందన్నారు. మ్యూజిక్ నేర్చుకునే ప్రాంతంలో వైలెన్స్ ఉండదన్నారు. మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు తాను అంగీకరిస్తున్నట్లు ఇళయరాజా తెలిపారు. మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటైతే తన లాంటి 200 మంది ఇళయరాజాలు తయారవుతారన్నారు. ప్రపంచ దేశాల్లో మన దేశం నుంచి వెళ్లిన చాలా మంది ప్రతిభ చూపిస్తున్నారన్నారు. ఇళయరాజా అంగీకరించడంతో తెలంగాణలో త్వరలోనే మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.