Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడాలపై హెచ్ఎండిఏ ఉక్కుపాదం మోపింది. పెద్ద అంబర్పేట దగ్గర అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు అధికారులు. విజయవాడ హైవే సమీపంలో 45 కోట్ల రూపాయల విలువ చేసే మూడు ఎకరాల కబ్జాకు యత్నించారు. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో ఇవాళ నిర్మాణాలను తొలగించారు. హెచ్ఎండిఏ కి చెందిన భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన ఐదుగురిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హెచ్ఎండిఏ భూముల జోలికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ జాతీయ రహదారి సమీపంలో హెచ్ఎండీఏ యాజమాన్యం హక్కులు కలిగిన మూడు ఎకరాల ఖాళీ స్థలంపై స్థానికులు కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో హెచ్ఎండీఏ భూ రికార్డులను సరిచూసుకొని స్థానిక తహసీల్దార్, పోలీసుల సహకారంతో హెచ్ఎండీఏ, ఓఆర్ఆర్ ల్యాండ్ ఎక్విజేషన్ అధికారి వి.విక్టర్, ఎన్ ఫోర్స్ మెంట్ డీఎస్పీ (ఇంచార్జీ) వెంకటేష్ తమ సిబ్బందితో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఐదు (5) ఇండ్లు, ప్రహరీ గోడలు, గేట్లను అధికారులు కూల్చివేచేశారు. కబ్జాదారులు, ఆక్రమణదారులు ఐదుగురిని గుర్తించి వారిపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు.