Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇంఫాల్
గిరిజన, గిరిజనేతరుల గ్రూపుల మధ్య మణిపూర్‌లో చెలరేగిన మారణహోమం 54 మందిని బలి తీసుకున్న నేపథ్యంలో భద్రతా దళాలు మరింత అప్రమత్తత పాటిస్తున్నాయి. ఇండో-మయన్మార్ సరిహద్దుల్లో వైమానిక నిఘాను ప్రారంభిస్తున్నాయి. భద్రతా దళాల కథనం ప్రకారం, భౌతిక దాడులు జరక్కుండా సరిహద్దు ప్రాంతాల్లో మానవరహిత విమానాలను వినియోగించనున్నారు. గ్రూపుల ఘర్షణల కారణంగా సరిహద్దుల వెంబడి శిబిరాలలో తలదాచుకుంటున్న ప్రజల భద్రత కోసం ఈ నిఘాను ఏర్పాటు చేస్తున్నట్టు రక్షణ వర్గాలు వెల్లడించాయి. మణిపూర్‌లో సాధారణ పరిస్థితి పునరుద్ధరించేంత వరకూ ఈ నిఘా కొనసాగుతుందని తెలిపాయి. మరోవైపు, రాష్ట్రంలో హింసను అదుపుచేందుకు పారామిలటరీ బలగాలను మోహరించారు. అల్లర్లకు అవకాశమున్న ప్రాంతాలలో అసోం రైఫిల్స్ నిరంతర విజిలెన్స్‌తో పాటు సరిహద్దుల వెంబడి నిఘా సాగిస్తున్నాయి. ఏరియల్ సర్వే కోసం యూఏవీలు, ఆర్మీ హెలికాప్టర్లను రాష్ట్రానికి కేటాయించారు. శనివారం తెల్లవారుజాము నుంచి చీటా హెలికాప్టర్లను ద్వారా పలుమార్లు ఏరియల్ సర్వేను ఆర్మీ నిర్వహించింది. మే 3న చురాచాద్పూర్ జిల్లాలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ఏటీఎస్యూఎం) ర్యాలీ నిర్వహించడం, టోర్బంగ్ ఏరియాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఐదురోజుల పాటు ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. హింసను అదుపుచేసేందుకు పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపింది.