Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చిన దశలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 'అవినీతి రేట్ కార్డ్' ప్రకటనలపై కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు ఎన్నికల కమిషన్ శనివారంనాడు నోటీసు జారీ చేసింది. ఆరోపణలను రుజువు చేసే నిర్దిష్ట సాక్ష్యాలను మే 7వ తేదీ సాయంత్రంలోగా 7 గంటల్లోపు తమకు సమర్పించాలని ఈసీ ఆదేశించింది. ఎలాంటి నిర్ధారణ లేని అవినీతి ఆరోపణలతో ఒక వార్తాపత్రికలో కాంగ్రెస్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందంటూ బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఈసీ ఈ నోటీసులు జారీ చేసింది. నియామకాలు, బదిలీలు, కమిషన్లకు సంబంధించి ప్రకటనల్లో ఇచ్చిన రేట్లకు సంబంధించిన సాక్ష్యాలను అందజేయడంతో పాటు పబ్లిక్ డొమైన్లో వాటిని ఉంచాలని కాంగ్రెస్ పార్టీని ఈసీ ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీని ట్రబుల్ ఇంజన్‌గా పేర్కొంటూ 2019-2023 మధ్య అవినీతి రేట్లతో కాంగ్రెస్ పార్టీ పలు పోస్టర్లు, అడ్వర్టైజ్మెంట్లు విడుదల చేసింది. కాగా, ఈనెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, 13న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.