Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ ఆదివారం జరుగనుంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 18.72 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం 499 నగరాలు, పట్టణాలు సహా విదేశాల్లో పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. తెలుగుతో పాటు 13 భాషల్లో పరీక్ష రాయవచ్చు. ఉదయం 11 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లో అనుమతిస్తారు. అయితే 1.30 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
రాష్ట్రం నుంచి దాదాపు 70 వేల మంది పరీక్ష రాయనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ సహా రాష్ట్రంలో 115 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నీట్ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పలు నిబంధనలు, ఆంక్షలు విధించింది. నిబంధనలు అతిక్రమించినవారిని మూడేండ్ల వరకు డిబార్ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. పరీక్షా సమయం కంటే గంట ముందుగా సెంటర్లకు చేరుకుంటే మంచిందని చెప్తున్నారు.