Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ భిక్కనూర్: కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రైసుమిల్లు సిబ్బందిపై చేయిచేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం బస్వాపూర్ శివారులోని పూర్ణిమ రైసుమిల్లు సిబ్బంది ధాన్యం సంచులను దింపుకోవడం లేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన శుక్రవారం రాత్రి రైసుమిల్లుకు చేరుకుని మిల్లు సిబ్బందిని వాకబు చేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం ఉన్పప్పటికీ అన్లోడ్ చేసుకోకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. రైసుమిల్లు సిబ్బంది అసంబద్ధ సమాధానాలు చెప్పడంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే వారిపై చేయిచేసుకున్నారు.
ఈ విషయం కలెక్టర్ జితేశ్ పాటిల్ దృష్టికి చేరడంతో కలెక్టర్ రైస్ మిల్లర్లతో మాట్లాడారు. కచ్చితంగా ధాన్యం దించుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ధాన్యం దించుకునేందుకు మిల్లర్లు ఒప్పుకున్నారు. కానీ, అందుకు కొంతసమయం పడుతుందని తెలిపారు. అయితే, ఈలోగానే తమ ధాన్యాన్ని పూర్ణిమ రైస్ మిల్లులో దించుకోనివ్వడం లేదని కొందరు రైతులు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే గంప గోవర్థన్ పూర్ణిమ రైస్ మిల్లు వద్దకు వెళ్లారు. ఎందుకు ధాన్యం దించుకోనివ్వరని మిల్లు సిబ్బందిని నిలదీశారు. అయితే వారు సమాధానం చెప్పిన తీరు ఎమ్మెల్యే గంప గోవర్ధనకు నచ్చలేదు. ఆగ్రహంతో రైస్ మిల్లు సిబ్బంది చెంప చెళ్లుమనిపించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చినా కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇది సరైంది కాదని ఎమ్మెల్యే అన్నారు.