Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రంగారెడ్డి: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కల్తీ వస్తువులు తయారు చేస్తున్న కల్తీరాయుళ్ల ముఠా గుట్టును ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. కాటేదాన్ పారిశ్రామికవాడలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు, మ్యాంగో కూల్ డ్రింక్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 500 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు లిటిల్ చాప్స్ పేరుతో మ్యాంగో డ్రింక్‌ను సీజ్ చేశారు. కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో పేస్టు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే గాటుగా ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్టులో అసిటిక్ యాసిడ్‌తో పాటు ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారు. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న ఈ కేటుగాళ్లు.. వెల్లుల్లి పాయల పొట్టును కూడా వదలని పరిస్థితి. మెషినరీలో కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో పాటు వెల్లుల్లి పాయల పొట్టును కూడా కలుపుతూ పేస్ట్ తయారు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.