Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కిన్షాసా: ఆఫ్రికా దేశమైన కాంగోలో వరద బీభత్సం సృష్టించింది. గత కొన్నిరోజులుగా కుంభవృష్టిగా కురుస్తున్న వానలతో దక్షిణ కివు ప్రావిన్స్‌లో నదులకు వరదలు పోటెత్తాయి. దీంతో ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయాయి. వరదల ధాటికి 176 మంది దుర్మరణం చెందగా, మరో 200 మందికిపైగా గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. కాగా, 227 మృతదేహాలను గుర్తించినట్లు సివిల్ సొసైటీ సభ్యుడు కసోల్ మార్టిన్ చెప్పారు. స్కూళ్లు, హాస్పిటళ్లు, ఇండ్లు వరదలకు తుడిచిపెట్టుకుపోయాయని వెల్లడించారు. నిలువ నీడలేకపోవడంతో ప్రజలు ఆరుబయటే నిద్రిస్తున్నారని పేర్కొన్నారు.
దక్షిణ కివూలో వరదలు, కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణమని అధికారులు తెలిపారు. 2014లో కూడా ఇంటి ప్రకృతి విపత్తే సంభవించిందన్నారు. భారీవర్షాలకు 7 వందలకుపైగా ఇండ్లు తుడిచిపెట్టుకుపోగా, 130 మందికిపైగా కనిపించకుండా పోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. గత నెలలో కురిసిన వాలనకు కొండచరియలు విరిగిపడి 21 మంది చనిపోయారు. దేశ రాజధాని కిన్షాసాలో డిసెంబర్లో కురిసిన భారీ వర్షాలతో 169 మంది మృతిచెందారు.