Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: రాష్ట్రంలో డీఎస్పీల బదిలీలు అధికార వైసీపీలో రాజేసిన మంట ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంఓ) చేరింది. గత నెల 25న జరిగిన డీఎస్పీల బదిలీల్లో సీఎంఓలోని కీలక అధికారి ఒకరు జోక్యం చేసుకోవడంతోపాటు వైసీపీ ప్రధాన నాయకుడు ఒకరు సలహాలివ్వడంపై కొందరు మంత్రులు, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు శాఖకు సంబంధించిన బదిలీలు సీఎంఓలోని అధికారి కనుసన్నల్లో చేయడంపై దుమారం రేగింది. ఒక సీనియర్ మంత్రి అయితే నేరుగా డీజీపీకే ఫోన్ చేసి ‘మా ప్రాంతంలో డీఎస్పీని మీ ఇష్టం వచ్చినట్లు ఎలా నియమిస్తారు? ఇక్కడ మీరొచ్చి ఎన్నికలు చేయండి’ అంటూ గట్టిగానే మాట్లాడడంతో పాటు ఇద్దరు ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రి కార్యాలయానికే వెళ్లి బదిలీలపై ఫిర్యాదు చేశారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎంఓలోని కీలక అధికారి వ్యవహారంపై నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ప్రతిగా ఆ అధికారి.. వారిపై అభియోగాలు మోపుతూ సీఎంకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారన్న ప్రచారమూ ఉంది. పరిస్థితి గంభీరంగా మారడంతో డీఎస్పీల బదిలీలను పునఃసమీక్షించాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే సర్దుబాట్లు చేసి తాజా బదిలీలు చేశారు. ఈ సర్దుబాటులోనూ రాజకీయ పలుకుబడి ఉన్నవారు, సామాజికవర్గంపరంగా కీలక మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిళ్లు మాత్రమే పనిచేసినట్లు తెలుస్తోంది.