Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జగిత్యాల: మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్‌రావు ఉరఫ్ గణపతి సొంత జిల్లాలో ఒకేసారి 15మంది సర్పంచ్‌లకు ఆ పార్టీ పేరిట లేఖలు విడుదల కావడం కలకలం రేపింది. శుక్ర, శనివారాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు ఈ లేఖలు అందినట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని 15 గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులతో పాటు, ఎంపీపీ, తహసీల్దార్, ఎంపీడీవోలు, నర్సింహులపల్లె గ్రామంలోని మరో 12 మందికి మావోయిస్టు గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ కార్యదర్శి మల్లికార్జున్ పేరిట లేఖలు అందాయి.
అటవీ భూములు ఆక్రమిస్తూ, అక్రమంగా పట్టాలు జారీచేస్తున్నారని, ఇందుకోసం రూ.కోట్లు దండుకున్నారని లేఖల్లో ఆరోపించింది. గ్రామాల్లో నిర్వహించాల్సిన పంచాయితీలను పోలీసుస్టేషన్ల దాకా తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. నర్సింహులపల్లెలో అక్రమంగా నిర్మించిన ఓ దుకాణాన్ని కూలి్చవేయాలని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారు తమ పద్ధతులు మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్షించాల్సి వస్తుందన్నారు. అయితే, ఒకేరోజు 15మంది సర్పంచ్‌లు, అధికారులు, గ్రామస్తులకు లేఖలు పోస్టు ద్వారా పంపించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇవి మావోయిస్టులు జారీచేసినవా లేక, కావాలనే కొందరిలా చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బాధితులు ఎస్పీతోపాటు సీఐ, ఎస్సైలను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. ఈ లేఖల విషయాన్ని ఎస్పీ భాస్కర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈవిషయంపై బీర్పూర్ ఎస్సై అజయ్‌ను వివరణ కోరగా పోలీస్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని చెప్పారు.