Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని ముండ్లమూరు గ్రామంలో ఆదివారం ఉదయం రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించడానికి ముందు భారీ శబ్దం వినిపించిందని కొంతమంది చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే భూమి కంపించడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చామని వివరించారు. ఈ ఘటనతో గ్రామస్థులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా భూకంప ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది మార్చిలో కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం రాతసలో భూమి కంపించింది. దీంతో గ్రామంలోని పలు ఇళ్ల గోడలు బీటలువారాయి. పలు సిమెంట్ రోడ్లు దెబ్బతిన్నాయి. ఇక ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల భూకంపం సంభవించింది. పులిచింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో తరచుగా భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో జనం ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టుకు సమీపంలోని తెలంగాణ గ్రామాల్లోనూ తరచూ భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి.