Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : చదువుకోవాలనే తపన ఉంటే వయసు అడ్డు కానే కదని చెప్పేందుకు ఉదాహరణగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నిలిచారు. మెడిసిన్ చదవాలనే తన కలను నెరవేర్చుకునేందుకు ఖమ్మంలో 49 ఏళ్ల వ్యక్తి.. తన 17 ఏళ్ల కుమార్తెతో కలిసి నీట్ పరీక్షకు సిద్ధమయ్యారు. ఆదివారం ఖమ్మంలోని వేర్వేరు కేంద్రాల్లో ఈ ఇద్దరూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌కు హాజరయ్యారు. నగరంలోని ఓ పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అయిన రాయల సతీష్‌బాబుకు మెడిసిన్ చదవాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక 1997లో బీటెక్ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత ఓ కోచింగ్ సెంటర్ నడుతున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ గతేడాది నీట్ అర్హత కోసం వయోపరిమితిని ఎత్తివేయడంతో ఆయనలో మళ్లీ ఆశలు చిగురించాయి. వయసు పెరిగినా తన కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. సతీష్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ కోర్సు చేశారు. నీట్ పరీక్ష రాయడానికి జీవశాస్త్రం అవసరం కాబట్టి ఇంటర్ లో జువాలజీ, బోటనీ సబ్జెక్టులకు హాజరు కావడానికి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి ప్రత్యేక అనుమతి కూడా పొందారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం జువాలజీ, బోటనీ పరీక్షలు రాశారు. వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరీక్షల్లో పాస్ అవడంతో పాటు నీట్‌ను కూడా క్రాక్ చేస్తానని ఆశిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎలాగైనా ఎంబీబీఎస్ పూర్తి చేసి హాస్పిటల్ పెట్టి పేదలక వైద్యం అందించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రయత్నంలో తాను నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోయినా యువతకు స్ఫూర్తిగా నిలవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఈ ఏడాది నీట్ లో పాస్ అవ్వకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని మళ్లీ రాస్తానని తెలిపారు. తన తండ్రితో కలిసి నీట్‌కు హాజరుకావడం చాలా సంతోషంగా ఉందని సతీష్ కూతురు జోషిక స్వప్నిక అంటోంది. కాగా, సతీష్ పెద్ద కూతురు సాత్విక ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో బీడీఎస్ చదువుతోంది.