Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జిల్లా కేంద్రమైన కామారెడ్డిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆస్తి పంపకాలు చేయలేదని, బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము ఇవ్వలేదని కన్నతల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు నిరాకరించిన ఘటన కామారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం జరిగింది. దీంతో అయిన వారు ఉన్నప్పటికీ కిష్టవ్వ అనాథగా మిగిలిపోయింది.
కామారెడ్డిలోని ఆర్బీ నగర్‌కు చెందిన కిష్టవ్వ (70)కు ముగ్గురు కుమార్తెలు కాగా.. ఇటీవల ఒక కుమార్తె చనిపోయింది. వీరంతా కామారెడ్డి పట్టణంలోనే నివసిస్తున్నారు. కిష్టవ్వ పేరుమీద ఓ ఇల్లు, బ్యాంకు ఖాతాలో రూ.1.15 లక్షల నగదు ఉన్నాయి. ఆమె ఆస్తులకు సంబంధించి దగ్గరి బంధువు ఒకరు నామినీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ డబ్బులను తమకు ఇవ్వాలంటూ ఇద్దరు కుమార్తెలు తల్లిపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో కిష్టవ్వ అనారోగ్యానికి గురవ్వగా.. గత నెల 21న కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆమె మృతి చెందింది. కిష్టవ్వ మృతి చెందినట్లు ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బతికి ఉన్నప్పుడు ఆమె బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు తమకు ఇవ్వలేదని, అందుకే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుమార్తెలిద్దరూ రాలేదని ఆస్పత్రి సిబ్బందికి తెలిసింది. దీంతో చేసేదేమీ లేక ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని శవాగారంలో ఉంచారు. బిడ్డలున్నా అనాథగా తల్లి మృతదేహాన్ని వదిలేయడం పలువురు హృదయాల్ని కలచివేసింది.