Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: కాన్షీరామ్ పోరాట మార్గంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన 'తెలంగాణ భరోసా సభ'కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల కోసం అంబేద్కర్ రిజర్వేషన్లు తెచ్చినా.. ఇంకా ఆ వర్గాల చెంతకు అభివృధ్ధి చేరలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోసం మరిన్ని చట్టాలు తేవాలని న్యాయమంత్రిగా అంబేద్కర్ భావించారని, ఆయన మాటలను అప్పటి ప్రధాని నెహ్రూ లక్ష్య పెట్టలేదన్నారు. జ్యోతిబా పూలే, అంబేడ్కర్, నారాయణగురు చూపిన బాటలో పయనిద్దామని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశానని మాయావతి చెప్పారు. బీఎస్పీ కేవలం ఎస్సీల కోసం కాదని, సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. తెలంగాణలో పేద దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.