Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: మణిపూర్‌లో చెలరేగిన అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకున్న ఒక తెలంగాణ విద్యార్థిని అధికారులు క్షేమంగా ఢిల్లీకి తీసుకువచ్చారు. రాష్ట్రప్రభుత్వం, ఢిల్లీలోని అధికారుల చొరవతో ఆదివారం ఢిల్లీలోని విమానాశ్రయానికి చేరుకున్న విద్యార్థి.. రాత్రి 11 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకున్నాడు. ఖమ్మం జిల్లా రాంనగర్ తండాకు చెందిన హర్షవర్ధన్ మణిపూర్ నిట్‌లో బీటెక్ చదువుతుండగా... ప్రభుత్వం సొంత ఖర్చులతో ఆయనను ఢిల్లీకి తీసుకువచ్చింది. తెలంగాణ భవన్లో ఆయనకు అధికారులు వసతి ఏర్పాట్లు చేశారు. సోమవారం స్వగ్రామానికి తరలిస్తామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా... ఇంఫాల్‌లో చిక్కుకుపోయిన పలువురు తెలుగు విద్యార్థులు ఇంకా అక్కడే నిరీక్షిస్తున్నారు.
సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిట్ చదువుతున్న విద్యార్థులు క్యాంప్‌సల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక గజగజ వణుకుతున్నారు. ఇప్పటికే అసోం, సిక్కిం, మధ్యప్రదేశ్, గోవా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల విద్యార్థులు వెళ్లిపోయారని, కేవలం తెలుగు విద్యార్థులం మాత్రమే ఉన్నామని హన్మకొండకు చెందిన శ్రీరామ్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే ఢిల్లీ ఐఆర్ఎస్ అధికారులకు వెళ్తుందని, వారు సరిగా స్పందించడంలేదని చెప్పారు. తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపించి, తమను ఇళ్లకు చేర్చాలని కోరారు. కాగా ఇంఫాల్‌లోని నిట్‌లో 50 మంది తెలంగాణ, 100 మంది ఏపీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. అలాగే సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 10 మంది తెలంగాణ, 23 మంది ఏపీ విద్యార్థులు ఉన్నారు.