Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కామారెడ్డి
కన్న పేగు కోసం జీవితాంతం ఆరాటపడిన ఆ తల్లికి చివరకు అనాథగా మిగిలింది. డబ్బులు ఇవ్వలేదని కడుపున పుట్టిన కూతుళ్లే తల్లిని మృతదేహాన్ని దవాఖానలో వదిలేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన కిష్టవ్వ (70) గత నెల 21వ తేదీన అనారోగ్యంతో ఏరియా దవాఖానలో చేరింది. కిష్టవ్వకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ముగ్గురిలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు కూతుళ్లు ఎల్లవ్వ, పెంటవ్వలు దవాఖానలో ఉంటూ ఆమె బాగోగులు చూసుకున్నారు.
కాగా కిష్టవ్వ పేరు మీద బ్యాంకులో రూ. లక్షా 70 వేలు ఉన్నాయి. ఈ డబ్బులకు సంబంధించి కిష్టవ్వ బంధువు నామినీగా ఉన్నారు. ఆ డబ్బులు తమకు ఇవ్వాలని ఇద్దరు కూతుళ్లు తల్లితో వాగ్వాదానికి దిగేవారు. కిష్టవ్వ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో కూతుళ్లు ఆమెను దవాఖానలోనే వదిలి వెళ్లిపోయారు. దీంతో కిష్టవ్వకు దవాఖాన సిబ్బంది సపర్యలు చేస్తూ వచ్చారు. ఆరోగ్యం క్షీణించడంతో శనివారం రాత్రి కిష్టవ్వ మృతి చెందింది. దవాఖాన సిబ్బంది కూతుళ్లకు సమాచారం ఇవ్వడంతో తమకు బ్యాంకులో ఉన్న డబ్బులు ఇప్పిస్తేనే మృతదేహాన్ని తీసుకెళ్తామని తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమి లేక వారు మృతదేహాన్ని భద్రపరిచారు. రేపటి వరకు చూసి మృతదేహాన్ని మున్సిపల్ వారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.