Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోల్కతా: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం వల్ల మే 8 నుంచి మే 12వతేదీ వరకు ఐదు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. మోచా తుపాన్ వల్ల అండమాన్, నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది.ఈ వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు.500 సంవత్సరాల క్రితం ప్రపంచానికి కాఫీని పరిచయం చేసిన ఎర్ర సముద్రపు ఓడరేవు నగరం పేరు మీదుగా యెమెన్ దేశం మోచా అని ఈ తుపానుకు పెట్టారు.తుపాను ఆగ్నేయ బంగాళాఖాతం,దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతోందని కోల్కతా డిప్యూటీ డైరెక్టర్ సంజీబ్ బెనర్జీ చెప్పారు. దీని ప్రభావం వల్ల మే 8వతేదీన అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఒడిశాలో మోచా తుపాను తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది.మే 8వతేదీ నుంచి మే 11 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని సూచించారు. అల్పపీడన వ్యవస్థ తుపానుగా మారే అవకాశం ఉన్నందున తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాతో సహా అంతటా ఉన్న తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు వివరించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ ప్రజలను కోరింది.