Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 430 పాయింట్ల లాభంతో 61,484 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 116 పాయింట్లు లాభపడి 18,185 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆరు పైసలు పుంజుకొని 81.72 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఒక్క సన్‌ఫార్మా మాత్రమే నష్టాల్లో కొనసాగుతోంది.
అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ఏప్రిల్‌లో అక్కడ కొత్త ఉద్యోగాల్లో ఆశించిన కంటే అధిక వృద్ధి నమోదైంది. మరోవైపు ఇటీవల వచ్చిన అమ్మకాల ఒత్తిడి నుంచి బ్యాంకింగ్ షేర్లు కోలుకోవడం కూడా కలిసొచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు ఆసియా- పసిఫిక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. చమురు ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 75.30 డాలర్ల వద్ద ట్రేడైంది. విదేశీ మదుపర్లు శుక్రవారం రూ.777.68 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు రూ.2,198.77 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.