Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సిక్కుల యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచిన అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుడు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్వర్ణ దేవాలయానికి సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్లో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కాగా, 24 గంటల వ్యవధిలో అదే ప్రాంతంలో తాజాగా మరో పేలుడు సంభవించింది.
గోల్డెన్ టెంపుల్కు వెళ్లే మార్గంలోని హెరిటేజ్ స్ట్రీట్లో సోమవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే సీనియర్ పోలీస్ అధికారులు, బాంబు స్క్యాడ్, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కాగా, వరుస పెలుళ్లతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒకే ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో రెండు పేలుళ్లు జరగడంతో ఆ ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు వెల్లడించారు. పేలుడు ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోందని.. స్థానికులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.