Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: రాజస్థాన్లోని డేగనా ప్రాంతంలో లిథియం ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్లో గుర్తించిన లిథియం నిల్వల కన్నా అధిక స్థాయిలో ఇక్కడ ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు. భారత్కు కావాల్సిన అవసరాలను ఆ లిథియం నిల్వలు 80 శాతం తీర్చే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్మూకశ్మీర్లో లిథియం రిజర్వ్స్ ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. గతంలో కర్నాటకలో స్వల్ప స్థాయిలో లిథియం ఖనిజ నిక్షేపాలను గుర్తించారు. అయితే జమ్మూకశ్మీర్, రాజస్థాన్లలో భారీ స్థాయిలో ఆ ఖనిజాలను గుర్తించడం విశేషం.
ఎలక్ట్రిక్ వాహనాల్లోని బ్యాటరీల్లో లిథియమే ప్రధానం. అత్యంత అరుదుగా ఉండే ఈ ఖనిజం కోసం ప్రభుత్వం చాన్నాళ్లుగా అన్వేషిస్తోంది. మరోవైపు లిథియం ఐయాన్ బ్యాటరీ అభివృద్ధి, ఉత్పత్తి కోసం జీఎస్ఐతో పాటు మరో మూడు కంపెనీలు విస్తృతంగా పనిచేస్తున్నాయి. లిథియం నిక్షేపాలు ఎక్కువగా దక్షిణ అమెరికాలో ఉన్నాయి. అర్జెంటీనా, బొలివియా, చిలీ దేశాల్లో సుమారు 50 శాతం నిక్షేపాలు ఉన్నాయి. ఇక 75 శాతం లిథియం రిఫైనింగ్ చైనా ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది.