Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జైలు కాంప్లెక్స్‌లో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్యను ఆపడంలో విఫలమయ్యారని తీహార్ జైలు అధికారులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని జైలు యంత్రాంగాన్నిఆదేశించింది. జైలు సూపరింటెండెంట్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది. జైలులోని సీసీటీవీ కెమెరాల్లో ఘటన మొత్తం రికార్డ్ అయినా కూడా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో కోర్టు అర్థం చేసుకోలేకపోతోందని జస్టిస్ జస్మీత్ సింగ్ విస్మయం వ్యక్తం చేశారు. జైలు కాంప్లెక్స్ లోకి నాలుగు కత్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
33 ఏళ్ల తాజ్‌పురియాను అతని సెల్ నుంచి బయటకు లాక్కొచ్చి కత్తులతో పొడిచి చంపిన దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని జస్టిస్ జస్మీత్ సింగ్ చూశారు. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని ఈ సందర్భంగా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జైలులో జరిగిన ఘటనకు బాధ్యులైన అధికారుల గురించి తమకు తెలియజేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను హైకోర్టు ఆదేశించింది. తాజ్‌పురియా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ తాజ్‌పురియా తండ్రి, సోదరుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. భద్రత కల్పించడాన్ని పరిశీలించాలని ఢిల్లీ పోలీసులకు జస్టిస్ జస్మీత్ సింగ్ సూచించారు. 2021లో ఢిల్లీ కోర్టులో గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగీని హత్య చేయడం వెనుక టిల్లు తాజ్‌పురియా హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మే 2న తీహార్ జైలులో పదునైన ఆయుధాలతో ప్రత్యర్థి ముఠా సభ్యులు పొడిచి చంపారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించలేదు. పోలీసులు వెనక్కి వెళ్లడం వీడియోలో కనిపించింది. టిల్లుపై దాడి చేసినప్పుడు తీహార్ జైలు గదిలో విధులు నిర్వహిస్తున్న తమిళనాడు స్పెషల్ పోలీస్ లోని ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.