Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కాకినాడ
కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిపాలన విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న యేంటి సత్యనారాయణ, ఆయన బంధువుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు సోమవారం దాడులు చేశారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని అనిశా అధికారులకు అందిన సమాచారం మేరకు ఆరుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోమవారం రాత్రి వరకు కొనసాగిన సోదాలకు సంబంధించిన వివరాలను ఏసీబీ ఏఎస్పీ సౌజన్య వెల్లడించారు. కాకినాడ గ్రామీణం ఇంద్రపాలెంలోని సత్యనారాయణ ఇంటితోపాటు అతని సోదరుడి ఇంట్లో సోదాలు నిర్వహించి సుమారు రూ. 3 కోట్ల (ప్రభుత్వ విలువ ప్రకారం) అక్రమ ఆస్తులను గుర్తించామని, సోదాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
కాకినాడ గ్రామీణం ఇంద్రపాలెంలో మూడు జీ ప్లస్ 2 భవనాలు, అయిదు ఖాళీ స్థలాలు, కాకినాడ జిల్లా కరప మండలం గంగంపాలెం, అరట్లకట్ట గ్రామాల్లో 2.65 ఎకరాల భూమి, సుమారు 392.71 గ్రాముల బంగారు ఆభరణాలు, 860 గ్రాముల వెండి వస్తువులు, స్కూటర్, జూనియర్ అసిస్టెంట్ ఇంట్లో రూ. 41,930, ఆయన సోదరుడు వీరబాబు ఇంట్లో రూ.8 లక్షల నగదు, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో రూ. 4,84,118, సోదరుడి పిల్లల పేరుతో బ్యాంకు డిపాజిట్లు రూ. 6,50,000, సోదరుడు వీరబాబు పేరు మీద లాకర్లో రూ.19 లక్షలు, వివిధ బ్యాంకు పాస్ పుస్తకాలను గుర్తించారు. వాటిని ఇంకా పరిశీలించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సత్యనారాయణ, ఆయన సోదరుడి ఇళ్లలో జరిపిన సోదాల్లో రూ. 38,76,048 నగదుతో పాటు బంగారం, విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ కాకినాడ జీజీహెచ్ పరిపాలన విభాగంలో 36 ఏళ్లుగా జూనియర్ అసిస్టెంట్‌గానే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఎ-1 సెక్షన్లో బడ్జెట్ షీట్‌కు సంబంధించిన బిల్లులను ట్రెజరీకి పంపించే విభాగంలో పనిచేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ జీతాలు, సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందికి జీతాలు వంటి పనులు ఆయనే చూస్తున్నారు.