Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జగిత్యాల : ఓ తండ్రి ఉపాధి నిమిత్తం పదేండ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లాడు. అప్పుడు అతని కుమారుడి వయసు రెండేండ్లు. పదేండ్ల నుంచి గల్ఫ్‌లోనే ఉంటున్న తండ్రి.. సోమవారమే జగిత్యాలకు వచ్చాడు. ఇక పిల్లలను చూసిన తండ్రి మురిసిపోయాడు. కానీ ఆ మురిపెం క్షణాల్లోనే ఆవిరైపోయింది. మంచినీళ్లు తీసుకొస్తానని ఇంటి నుంచి బయల్దేరిన కుమారుడు రోడ్డుప్రమాదంలో చనిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల పట్టణంలోని మహాలక్ష్మినగర్‌కు చెందిన చౌట్పల్లి మోహన్, పద్మిని దంపతులకు కుమార్తె హర్ష, కుమారుడు శివకార్తీక్(12) ఉన్నారు. అయితే శివకార్తీక్కు రెండేండ్ల వయసున్నప్పుడు మోహన్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. ఇక అప్పట్నుంచి ఫోన్లోనే పిల్లల బాగోగులు తెలుసుకుంటూ ఉండేవాడు మోహన్. పదేండ్ల తర్వాత సోమవారం హైదరాబాద్‌కు వచ్చాడు. దీంతో భార్య, పిల్లలు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి, మోహన్‌ను ఇంటికి తీసుకొచ్చారు. తమ ఇంట్లో తాగునీరు అయిపోవడంతో తాను తీసుకొస్తానని శివకార్తిక్ యాక్టివాపై వెళ్లాడు. బైపాస్ రహదారిలోని దేవిశ్రీ గార్డెన్ సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. తీవ్రగాయాలవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. శివకార్తీక్ ఐదో తరగతి చదువుతున్నాడు.