Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఆఫ్రికా దేశమైన కాంగోలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ దేశం అల్లాడుతోంది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగి.. దక్షిణ కివు ప్రావిన్స్ ను వరదలు ముంచెత్తాయి. దీంతో పలు చోట్ల ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయాయి. వరదలకు తోడు ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి.
ఈ విపత్తులో ఆ దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 400 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ తియో గ్వాబిజే కాసీ వెల్లడించారు. వందలమంది గల్లంతయ్యారని తెలిపారు. కివు లోయలో బురదలో మృతదేహాలు కూరుకుపోయినట్లు చెప్పారు. మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ విపత్తులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. భారీగా ముంచెత్తిన వరదల కారణంగా పాఠశాలలు, ఆసుపత్రులు, ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో చాలా మంది ప్రజలు నిలువనీడ లేక ఆరుబయటే నిద్రిస్తున్నారు. కాలేహీ టెరిటరీ పరిధిలోని దక్షిణ కివు ప్రాంత బుషుషు,న్యాముకుబి గ్రామాలు వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయాయి. ఈ వరదల్లో సుమారు 1200 ఇళ్లు పూర్తిగా శిథిలమైనట్లు అధికారులు వెల్లడించారు. 2014లో ఇలాంటి ప్రకృతి విపత్తే సంభవించినట్లు తెలిపారు.